ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..
బిగ్‌బాస్ 1
బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్‌స్క్రీన్‌పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.
బిగ్‌బాస్ 2
బిగ్‌బాస్ రెండో సీజన్‌లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.
బిగ్‌బాస్ 3
శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.
బిగ్‌బాస్ 4
కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.
బిగ్‌బాస్ 5
బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'
బిగ్‌బాస్ 6
ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.
బిగ్‌బాస్ 7
రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)
హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్‌లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment