సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే టీఆర్‌ఎస్ నాయకులు ఒక్కరు కూడా పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గురువారం ట్యాంక్ బండ్ వద్ద ముగ్ధుమ్ విగ్రహం వద్ద చాడ వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్, పొన్నాల లక్ష్మయ్యలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. నివాళులు అర్పించకుండా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు.
ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పిల్లలు చనిపోయారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థులకు అండగా తాము ఉన్నామని బరోసా ఇచ్చారు. తమను ఆడ్డుకోవడానికి వచ్చే పోలీసులను పిల్లల ఆత్మహత్యలను ఆపడానికి వినియోగించాలని సూచించారు.
ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు : పొన్నం ప్రభాకర్
ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంటర్ బోర్డుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలని, నివాళులు అర్పించేందుకు వస్తే కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment