భూమన కరుణాకర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ముద్దాయి అని దేశమంతా నమ్ముతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ టేపు రికార్డులో ఉన్న గొంతు చంద్రబాబుదే అన్నది స్పష్టమైందని తెలిపారు. చంద్రబాబును అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే, కానీ ఇలా తప్పుడు పనులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండటం వల్లే ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోందని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు తెలంగాన పోలీసులు చేపట్టిన విచారణ అడ్డుకారాదని పేర్కొన్నారు. ఓటు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని, ఛార్జిషీటులో ఆయన పేరు ఇంతవరకూ ఎందుకు చేర్చలేదని భూమన ప్రశ్నించారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పేరు చేర్చకుంటే వారు కూడా చట్ట వ్యతిరేకులే అన్నారు. సామాన్యుడైనా, సీఎం అయినా చట్టాలు ఒకే తీరుగా ఉంటాయని, దీన్ని అందరూ సమ్మతిస్తారని చెప్పారు. అయినా ఏళ్లు గడుస్తున్నా కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేల ఓట్లు కొనేందుకు చూసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును విచారణకు పిలవకపోవడం దారుణమన్నారు.
కేసుకు భయపడ్డ చంద్రబాబు.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద సాగిలపడ్డారో.. లేక తెలంగాణలో కేసీఆర్ వద్ద సాగిల పడ్డారోనని, అందుకే ఇన్నాళ్లు ఈ కేసులో నిర్లిప్తత కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు గురించి భయపడే చంద్రబాబు విజయవాడకు పారిపోయారని ఆరోపించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అకస్మాత్తుగా అమరావతికి మకాం మార్చడం వెనక అసలు ఉద్దేశం ఓటుకు కోట్లు కేసు భయమేనని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment