
సాక్షి, అమరావతి: రాజకీయ కుతంత్రాల సినిమాలో ఇంతవరకు తన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్‌తో షో చేస్తున్న చంద్రబాబు తాజాగా గెస్ట్ ఆర్టిస్టులను కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. కుమ్మక్కు కుట్రలో తామిద్దరం ఎంతగా నటిస్తున్నప్పటికీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమని తేటతెల్లం కావడంతో చంద్రబాబు స్పెషల్ అప్పియరెన్సుల మీద దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను తీసుకువచ్చారు. మరికొందరినీ లైన్‌లో పెట్టారు. కాకపోతే చంద్రబాబు తన రాజకీయ మకిలిని తమకూ అంటిస్తున్నారని.. తమను కేవలం కుల పెద్దల స్థాయికి దిగజార్చేస్తున్నారని ఆ పాత్రధారులకు తెలియడం లేదు. చంద్రబాబు ఎందరితో ఏం చేయించినా సరే టీడీపీ సినిమాను బాక్సాఫీసు వద్ద కుదేలు చేసేందుకు రాజకీయ ప్రేక్షకులైన ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేయడం కొసమెరుపు.
జాతీయస్థాయి నేతలా? కుల పెద్దలా?
ఓటమి ఖాయమని తేలడంతో చంద్రబాబు జాతీయస్థాయి నేతలను కూడా రాష్ట్రానికి తెచ్చి భ్రష్టుపట్టిస్తున్నారు. వారిని కుల పెద్దలు, మతపరమైన పంచాయతీలు చేసేవారి స్థాయికి దిగజార్చుతున్నారు. ఆ నేతలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ రూపొందించిన ప్రచార షెడ్యూలే ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. చంద్రబాబుతో కలసి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం కడపలోనూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువుగా ఉన్నందునే అక్కడ ఆయనతో ప్రచారాన్ని నిర్వహించింది. అంటే ఫరూక్ అబ్దుల్లాను కేవలం ముస్లిం నాయకుడిగానే తాము గుర్తిస్తున్నామని ఆయనకు అంతకుమించిన స్థాయిలేదని టీడీపీ పరోక్షంగా తేల్చి చెప్పిందన్నమాట. రాజకీయంగా ఏనాడో ప్రాభవం కోల్పోయిన ఆయన సొంత రాష్ట్రం జమ్మూకాశ్మీర్‌కు వెళ్లకుండా లండన్‌లోనూ, ఢిల్లీలోనూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడాయన టీడీపీ తరఫున కేవలం ముస్లింలు ఉన్న ప్రాంతాల్లోనే ప్రచారం చేయడం ద్వారా ఆయన పరపతిని గల్లీ నేత స్థాయికి దిగజార్చారని ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బీజేపీతో 1998 నుంచి 2004 వరకు, మళ్లీ 2014 నుంచి 2018 వరకు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబును తామెలా విశ్వసిస్తామని ముస్లింలు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీడీపీ తరఫున విజయవాడ, విశాఖపట్నంలలో గురువారం, ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఆమెతో ఆ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉండే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, విశాఖపట్నంలోని దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని టీడీపీ నిర్ణయించింది. అంటే పశ్చిమ బెంగాల్‌లో వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన మమతా బెనర్జీని కూడా కేవలం ఓ కుల పెద్ద స్థాయికి చంద్రబాబు దిగజార్చారన్నది స్పష్టమవుతోంది. అలాగని బ్రాహ్మణ సామాజిక వర్గానికి టీడీపీ రాజకీయంగా ఏమైనా గుర్తింపు ఇచ్చిందా అంటే.. అదీ లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి టీడీపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాలుగు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించడంతో బ్రాహ్మణ సామాజికవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ఆ నాలుగు స్థానాల్లో విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం, విశాఖపట్నంలోని దక్షిణ, తూర్పు నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో చంద్రబాబు హడలెత్తిపోయి ఆ సామాజికవర్గానికి చెందిన మమతా బెనర్జీతో ఆ నియోజకవర్గాల్లోనే ప్రచారం చేయించాలనే ఎత్తుగడ వేశారు.
‘బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదు కానీ మమతా బెనర్జీని తీసుకువచ్చి తమ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను ఓడించాలని కుట్ర చేస్తారా’ అని బ్రాహ్మణ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా చంద్రబాబు అదే గాటన కడుతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనతో ఆ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న విశాఖపట్నం, విజయవాడలలో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా కేవలం కుల పెద్ద లాగానే చంద్రబాబు పరిగణిస్తుండటం విస్మయపరుస్తోంది. కర్ణాటకకు చెందిన వక్కలిగ సామాజికవర్గానికి చెందిన ఆయనతో ఆ సామాజికవర్గ ఓటర్లు ఉండే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రచారం చేయించాలని ఎత్తుగడ వేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌తో నెల్లూరులో ప్రచారం చేయించాలన్నది టీడీపీ యోచన. యాదవ సామాజికవర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నెల్లూరులో ఆ సామాజికవర్గానికి టీడీపీ టిక్కెట్టు ఇవ్వలేదు. మంత్రి నారాయణను అభ్యర్థిగా నిర్ణయించింది. కానీ వైఎస్సార్‌సీపీ మాత్రం యాదవ సామాజికవర్గానికి చెందిన తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌నే మరోసారి అభ్యర్థిగా నిర్ణయించింది. దాంతో యాదవ సామాజికవర్గ ఓటర్లలో చీలిక తేవడానికి తేజస్వీ యాదవ్‌తో నెల్లూరులో ప్రచారం చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా తమిళ ఓటర్లు ఎక్కువుగా ఉండే చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ప్రచారం చేయించాలని కూడా టీడీపీ యోచిస్తోంది.
టీడీపీ తరఫున ప్రచారం చేయరూ.. ప్లీజ్
రాజకీయ విలువలను అంతకంతకూ దిగజార్చడంలో చంద్రబాబు తన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. జాతీయ స్థాయి నేతలుగా గుర్తింపు ఉన్న వారిని కేవలం కుల పెద్దలుగా, మత పంచాయతీలు చేసేవారి స్థాయికి దిగజారుస్తున్నారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోదీ వ్యతిరేక పోరాటం ముసుగులో ముందస్తుగానే సన్నద్ధమయ్యారన్నది స్పష్టమైంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ గడ్డు పరిస్థితిని ముందే గుర్తించిన చంద్రబాబు ముందస్తు జాగ్రత్తగానే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నేతలతో టచ్‌లో ఉంటూ వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తనను ఆదుకునేందుకు రావాల్సిందిగా వారిని అర్థించారు. ఆయన బతిమలాడటంతో కొందరు నేతలు టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు సమ్మతించారని సమాచారం. ఈ క్రమంలోనే మొదటగా జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మంగళవారం టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్, స్టాలిన్ మరికొందరు కూడా త్వరలో టీడీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment