ఆత్మీయ సమావేశంలో మాజీ ఆర్మీ ఉద్యోగులు (ఫైల్)
కార్పొరేషన్ మాయ :
ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కొత్తడ్రామాకు తెరదీశారు. మాజీ సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో ప్రకటించారు. ఇందుకు రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి జీఓ ఇవ్వలేదు. నిధులు కేటాయించకుండా మొండిచెయ్యి చూపారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలను మంజూరు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ జవాన్లు వాపోతున్నారు.
పూర్తిగా నిర్లక్ష్యం :
20 ఏళ్ల కిందట టీటీడీలో మాజీ సైనికులకు రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ప్రస్తుతం దాన్ని పూర్తిగా విస్మరించారు. కేవలం పలు శాఖల్లో ఔట్‌సోర్సింగ్ కింద మాత్రమే నియామకాలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 మందికి పైగా గన్ లైసెన్స్ ఉన్నారని, వీరికి అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెబుతామని శపథం చేస్తున్నారు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు చింతకొమ్మదిన్నె మండలంలో మాజీ సైనికుల భూములను కోట్టేశారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి ఉందని వారు వాపోతున్నారు.
ఆదుకున్న వైఎస్సార్ :
దివంగత సీఎం వైఎస్సార్ 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు మాజీ సైనికులు ఇంటిపట్టాలు ఇచ్చారు. దీంతో పావలా వడ్డీతో రుణాలు ఇచ్చారు. 2009 ఎన్నికల సమయంలో మరిన్ని సంక్షేమ పథకాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారని కానీ ఆయన మరణంతో తదుపరి ఏర్పడిన ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని మాజీ జవాన్లు చెబుతున్నారు.
మాజీ సైనికుల ప్రధాన డిమాండ్లు ఇవే
- వైఎస్సార్ తరహాలోనే ఇంటి పట్టాలు, పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలి.
- రూ.వెయ్యి కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టాలి.
- ప్రతి మాజీ సైనికుడికి ఇంటిస్థలాలు, పొలాలు అందించాలి.
- అలాగే కేటాయించిన ఇంటి స్థలాల ప్రాంతంలో ప్రత్యేక నిధులతో బోర్లు, రోడ్లు ఏర్పాటు చేయించాలి.
- తమకు పక్కా గృహాలు కేటాయించాలి.
- ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు కల్పించాలి.
- ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
- ఎక్కువ మంది మాజీ సైనికులు ఉన్న ప్రాంతంలో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి.
వైఎస్సార్ మాదిరి చేయాలి
వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలువురు మాజీ సైనికులు ఇంటి పట్టాలు అందాయి. పావలా వడ్డీలతో రుణాలిచ్చి మాజీ సైనికులను గౌరవించారు. ఆయన తరహాలో పథకాలు అమలు చేసే నాయకుడికే మాజీ జవాన్లు మద్దతు పలుకుతున్నారు. చాలామంది వైఎస్‌జగన్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
– రామక్రిష్ణారెడ్డి, పోరుమామిళ్ల
అర్హులైన అధికారులను నియమించాలి
జిల్లాస్థాయి మాజీ సైనిక్ వేల్ఫేర్ బోర్డుల్లో అర్హులైన అధికారులను నియమించాలి. ఇతర శాఖలకు చెందిన అధికారులను నియమించడంతో మాజీ సైనికులకు సంక్షేమ ఫలాలు అందడం లేదు. అర్హులైన మాజీ సైనికులను నియమిస్తే అన్ని బెనిఫిట్స్ మాజీ సైనికులకు అందుతాయి.
– కెప్టెన్ నారాయణ, పోరుమామిళ్ల
చెప్పినవి కూడా చేయలేరా?
మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం పెట్టలేదు. చెప్పిన హామీని నెరవేర్చలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. మాజీ సైనికులకు అన్ని రకాల వసతులు కల్పించాలి.
– టీఎం బాషా, పోరుమామిళ్ల
ప్రభుత్వాలు చొరవ చూపాలి
సైన్యంలో సేవలందిచి ఇక్కడికి వచ్చాక మాజీ సైనికులకు అందాల్సిన బెనిఫిట్స్ అందడం లేదు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లురిగేలా తిరగాల్సి వస్తోంది. మా పరిస్థితి చూసి నేటి యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా మాజీ సైనికులకు తగిన గౌరవం, వసతులు కల్పించాల్సి ఉంది.
– బయన యల్లారెడ్డి, పోరుమామిళ్ల
Comments
Please login to add a commentAdd a comment