గండికోటలోని పెన్నా నది సోయగం
సాక్షి,కడప కల్చరల్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక రంగం అభివృద్ధి దిశగా పరుగులు తీసింది. మన జిల్లాలో 28 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి్దకి రూ. 39 కోట్లు కేటాయించారు. వివిధ పనులు ప్రారంభించారు. ఆయన అకస్మిక మృతితో అవన్నీ ఆగిపోయాయి. ఆయన తర్వాత పర్యాటక రంగ ప్రగతి నిలిచిపోయింది. ఉనికినే కోల్పోయింది. ఈ జిల్లాపై అన్ని విధాల చిన్నచూపు చూసే తత్వమున్న చంద్రబాబు
పర్యాటక రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ‘నీరున్నచోటే పర్యాటక అభివృద్ది. కరువు ప్రాంతాల్లో పెట్టుబడులు వృథా’... అంటూ సీమలో పర్యాటక ఉత్సవాలను రద్దు చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి. రాజకీయంగా ఈ జిల్లా తనకు అనుకూలంగా లేదన్న కక్ష ఇందులో కనిపిస్తోందని పర్యాటక రంగ హితేషులు పేర్కొంటున్నారు. వైఎస్ మరణానంతరం జిల్లాలో పర్యాటకాభివృద్ధి్దకి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఏ ప్రాంతాన్ని ఈ దిశగా అభివృద్ధి్ద చేయలేదనే భావన జిల్లా వాసుల్లో ఉంది.
ఒంటిమిట్ట క్షేత్రానికి చారిత్రక మార్పులో భాగంగా అధికార హోదా దక్కింది. ఈ విషయంలో ప్రభుత్వం చేసిందంటూ ఏం లేదు. ఒక దశలో పొరుగు జిల్లాకు తరలించే ప్రయత్నాలూ జరిగాయి. మన జిల్లా మినహా రాష్ట్రమంతా సంవత్సరానికి రెండు, మూడు చొప్పున పర్యాటక ఉత్సవాలు నిర్వహించిన చంద్రబాబు కడప జిల్లాను పూర్తిగా విస్మరించారు. దీనిపై స్థానిక పర్యాటక సంస్థలు ఉద్యమించడంతో ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఐదేళ్లలో నాలుగుసార్లు అయిష్టంగా అరకొర నిధులతో గండికోట ఉత్సవాలను నిర్వహించింది. అంతకుమించి జిల్లాలో పర్యాటక పరంగా ఒక్క అడుగు కూడా వేయలేదు.
గాలి హామీలే
జిల్లాకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక పర్యాటక సంస్థల పోరు పడలేక పలు హామీలు గుప్పించారు. తిరుపతి నుంచి తాళ్లపాక, నందలూరు సౌమ్యనాథ ఆలయం, సోమశిల బ్యాక్ వాటర్ మీదుగా ఒంటిమిట్టకు పర్యాటక హబ్ ప్రకటించారు. మరోసారి ఒంటిమిట్ట నుంచి మాధవరం, దేవునికడప, పెద్దదర్గా, క్యాథడ్రల్ చర్చిల మీదుగా పుష్పగిరి వరకు ఆధ్యాత్మిక హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకోసారి ఒంటిమిట్ట, గండికోట, సిద్దవటం కోటలతో హిస్టారికల్ హబ్ అన్నారు. జిల్లాకువచ్చిన ప్రతిసారి హెలి టూరిజం, టెంపుల్ టూరిజం అంటూ మాటలు చెప్పుకొస్తూనే ఉన్నారు. గండికోటలో ఒకరోజు నిద్ర చేసి రూ.100 కోట్లతో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవన్నీ నీటి మూటలుగా మిగిలాయి.
ప్రైవేటుకు హరిత
డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రమంతటా పర్యాటకాభివృద్ధి్దలో భాగంగా హరిత హోటళ్లను నిర్మించారు. మన జిల్లాలో కూడా పది హోటళ్లు నిర్మితమయ్యాయి. వచ్చిన ఆదాయాన్ని ఎవరికి వారు వినియోగించకోవడమేగానీ అభివృద్ధికి కృషి చేయలేదు. మరోపక్క పర్యవేక్షణ లోపంతో ఈ హోటళ్లలో కొన్ని ప్రైవేటు వ్యక్తుల పాలయ్యాయి. మిగిలినవి మూతపడ్డాయి. అస్మదీయులే పర్యవేక్షకులు కావడంతో అవినీతి, ఉద్యోగుల మధ్య విబేధాలతో పచ్చగా ఉండాల్సిన హరిత హోటళ్లు నష్టాల బాట పడ్డాయి.
డాక్టర్ వైఎస్ మొదలు పెట్టిన పర్యాటకాభివృద్ధి్ద పూర్తిగా ముందుకు వెళ్లకపోగా తిరోగమనం వైపు నడిపించడంతో జిల్లా పర్యాటకరంగ అభివృద్ధి కుంటుపడింది. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో కనీసం జిల్లా కేంద్రమైన కడప నగరంలో కూడా పర్యాటక ప్రాంతాల వివరాలు అందించే ఔట్‌లెట్ లేకపోవడం గమనార్హం. ప్రైవేటు పర్యాటక సంస్థలు ప్రచురించిన పర్యాటక సాహిత్యం కూడా కార్యాలయంలో అందుబాటులో లేదన్నది సత్యం. జిల్లాలో ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అవి ఏమేం ప్రత్యేకతలు కలిగి ఉన్నాయో కనీసం జిల్లా కేంద్రంలోనే కాకుండా ఆ ప్రాంతాల్లో కూడా ఒక్క బోర్డు కనిపించకపోవడం పాలకులకు జిల్లా పర్యాటకరంగ అభివృద్ధి్దపై శ్రద్ధకు అద్దం పడుతుంది.
జిల్లాలో టూరిజం కళ
ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన కల వైఎస్ హయాంలో నెరవేరింది. జిల్లాలోని టూరిజం ప్రాంతాలకు మోక్షం లభించింది. 27 ప్రాంతాల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 37 కోట్లు మంజూరు చేశారు. ఉవ్వెత్తున పర్యాటకాభివృద్ధి ప్రారంభమైంది. ఆయన మరణం తర్వాత కూడా ఆ దిశగా పనులు చేసిఉంటే పర్యాటక రంగం జిల్లాకు తలమానికంగా నిలిచేది.– ఎస్.సీతారామయ్య, పర్యాటకరంగ పితామహులు, కడప
కొనసాగి ఉంటే
జిల్లాలో 2005లో ప్రారంభమైన పర్యాటకరంగ అభివృద్ధి జోరు కొనసాగి ఉంటే రాష్ట్రంలో మన జిల్లాకు పర్యాటకరంగంలో విశిష్ఠ స్థానం లభించి ఉండేది. ఆ దశలో పలు పర్యాటక ప్రాంతాలకు మంచి గుర్తింపు లభించింది. పూర్తి స్థాయి అభివృద్ధికి జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలను పర్యాటకానికి అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉంది.– భారవి, పర్యాటకాభిమాని, న్యాయవాది, కడప
Comments
Please login to add a commentAdd a comment