టీడీపీ కుట్రలకు చెల్లు చీటీ... | Chandrababu Conspiracies was failed in elections | Sakshi
Sakshi News home page

టీడీపీ కుట్రలకు చెల్లు చీటీ...కుతంత్రాలకు చరమగీతం

Published Fri, May 24 2019 4:02 AM | Last Updated on Fri, May 24 2019 5:17 AM

Chandrababu Conspiracies was failed in elections - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు, మాయోపాయాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సరైన రీతిలో తగిన బుద్ధి చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవడానికి ఆయన వేసిన అడ్డదిడ్డమైన ఎత్తులను ఏకపక్ష తీర్పుతో చిత్తు చేశారు. వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతూ... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే పెద్దఎత్తున ఆమోదంతో, కనీవిని ఎరుగని భారీ మెజార్టీలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారు. ఈ సునామీలో మంత్రులు సహా తెలుగుదేశం పార్టీ  హేమాహేమీలు ఘోర పరాజయం పాలయ్యారు.  

అన్ని ఎత్తులను తుడిచిపెట్టేశారు...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ, వైఎస్‌ జగన్‌ను అడ్డుకునేందుకు దశాబ్దం నుంచి టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయంగానే కాక ఇతర మార్గాల్లోనూ అనేక పన్నాగాలు పన్నారు. ఈ ఎన్నికల్లో వాటిని పరాకాష్టకు తీసుకెళ్లారు. ఎలాగైనా గెలవాలనన్నట్లుగా టీడీపీ ఎంచుకున్న అడ్డదారులను, చివరకు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడటాన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు పసిగట్టి గట్టిగా తిప్పికొట్టారు. 

పురిట్లోనే గొంతు నులిమేయాలని...
2011 సమయంలో దేశంలో అత్యంత బలీయ నాయకురాలైన సోనియాగాంధీని ఎదిరించి... కాంగ్రెస్‌ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన మరుక్షణమే చంద్రబాబు దొంగదెబ్బకు సిద్ధమయ్యారు. ఆ ఏడాది ఉప ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో గెలవడంతో తమకు, తమ పార్టీలకు వైఎస్‌ జగన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పెనుముప్పని ఊహించిన చంద్రబాబు... ఏకంగా బద్ధ శత్రువు, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను అణగదొక్కడంపైనే దృష్టిపెట్టారు. అధికార పార్టీ అరాచకాలను పట్టించుకోలేదు. కానీ, దీనిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీలో నిలదీసింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. టీడీపీ మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడింది. చివరకు జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి సీబీఐని ఉసిగొల్పారు. 

2014లో నలుగురూ ఒక్కటై
2014 సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను టీడీపీలో చేర్చుకోవడమే కాక ఆ పార్టీతో తెరవెనుక ఒప్పందంతో వారి ఓట్లు తమకు పడేలా చంద్రబాబు వ్యూహాలు పన్నారు. ఓవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను ఓడించే సత్తా లేక, షరా మామూలుగా ఒంటరి పోరుకు భయపడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. మరోవైపు సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ నుంచి బేషరతు మద్దతుకు పాకులాడారు. అన్నిటికి మంచి నీచస్థాయికి దిగజారి... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మహిళా నేతలపై అసత్య ఆరోపణలు చేయించారు. రూ.వేల కోట్లను మంచి నీళ్లలా వెదజల్లి, కులాల వారీగా ఓటర్లను చీల్చి అనారోగ్యకర వాతావరణం సృష్టించారు. అయినా, కేవలం 1.96 (5 లక్షల ఓట్లు) శాతం ఓట్ల తేడాతోనే నెగ్గగలిగారు.

అధికారంలోకి వచ్చాక మరిన్ని కుతంత్రాలు
విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరునాటి నుంచే మరిన్ని కుట్రలు పన్నారు చంద్రబాబు. 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాక, నలుగురికి మంత్రి పదవులిచ్చారు. ప్రజా సమస్యలు ప్రస్తావించనీయకుండా మందబలంతో అసెంబ్లీలో ఆ పార్టీని అడ్డుకున్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి... రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెడితే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం దానిపై ఆందోళనలు చేపట్టి డిమాండ్‌ను సజీవంగా ఉంచారు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా తుని వద్ద రైలును దహనం చేసి ఆ కుట్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలను ఇరికించేందుకు యత్నించారు.  రాజధాని ప్రాంతంలో రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపై కేసులు బనాయించి జైలుకు పంపారు. ఇన్ని చేసినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆత్మ స్థైర్యంతో ప్రజల వెనుక నిలిచి పోరాటం కొనసాగించింది.

ఎన్నికల కుట్రలెన్నెన్నో
2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబుకు అడ్డులేకుండా పోయింది. అధికారం అడ్డంపెట్టుకుని నిబంధనలు, రాజ్యాంగ పరిధులను విస్మరించి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అణచేందుకు ప్రయత్నాలు చేశారు. టీడీపీ అరాచక పాలనలో నలిగిపోతున్న ప్రజానీకాన్ని ఓదార్చేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర చేపడితే అడ్డుకొనేందుకు చంద్రబాబు, తెలుగుదేశం నేతలే కాక కొందరు పోలీసు ఉన్నతాధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. చివరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికీ ఒడిగట్టారు. ఆ కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నించారు. ఎన్నికల్లో ఓటమి తథ్యమన్న అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు ఆపసోపాలు పడ్డారు. జనసేన పార్టీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటూ ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగేలా చూశారు. ఆ పార్టీకి అభ్యర్ధులను ఎంపిక చేయడమే కాక వారికి రూ.కోట్లకు కోట్లు సమకూర్చారు. హెలికాప్టర్‌ గుర్తుతో, పార్టీ జెండాలు, కండువాలు ఒకేలా ఉండేలా చేసి ప్రజాశాంతి పార్టీ అంటూ కేఏ పాల్‌ను బరిలో దించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. 

ఈవీఎంలపై నెపాన్ని నెట్టే ప్రయత్నం
ఇన్ని చేసినా ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైపే ఉండటంతో చంద్రబాబు  దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఘోర పరాజయం తప్పదని తెలిసిపోవడంతో సాకులు వెదికారు. ఈవీఎంల వల్లనే ఓడామని చెప్పుకొనేందుకు వాటిపై పెద్ద రాద్ధాంతమే లేవదీశారు. తన వైఫల్యాలు, ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జాతీయ స్థాయి పోరాటమంటూ తిరిగారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement