ప్రచారాలతో ఇంకెన్నాళ్లు ఈ మోసం.. | Chandrababu Graphics has Announced That Water Has Been Provided to The Districts For Votes in The Elections | Sakshi
Sakshi News home page

ప్రచారాలతో ఇంకెన్నాళ్లు ఈ మోసం..

Published Tue, Mar 26 2019 8:03 AM | Last Updated on Tue, Mar 26 2019 8:03 AM

Chandrababu Graphics has Announced That Water Has Been Provided to The Districts For Votes in The Elections - Sakshi

సాక్షి, గుంటూరు : సాగునీటికి కరువు.. తాగునీటికీ కరువు.. పశుగ్రాసానికి కరువు.. ఇంత కరువా.. కచ్చితంగా కరువుకు కేంద్రబిందువు.. ఇది అనంతపురం జిల్లాలోని గ్రామాల పరిస్థితి అయి ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. మానవ నిర్మిత ఆధునిక దేవాలయంగా తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించిన నాగార్జునసాగర్‌కు కూతవేటు దూరంలో ఉండే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వినుకొండ సహా వివిధ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో నెలకొన్న క్షామ పరిస్థితులు.

ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికి సీమ జిల్లాలకు నీరందించామని చంద్రబాబు గ్రాఫిక్స్‌ ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పక్కనే సాగర్‌ ఉన్నా పంటలు ఎండిపోతున్న పరిస్థితి.. కళ్లెదుటే పంటలు ఎండిపోవడం చూడలేక నీళ్లు పడతాయనే ఆశతో బోర్ల మీద బోర్లు వేసినా చుక్కనీరు పడని వైనం.. దాహార్తి తీర్చుకోడానికి కూడా గుక్కెడు నీరు లభించక ఏ గ్రామంలో చూసినా దైన్యస్థితి.. ఉపాధి లేక గ్రామాలకు గ్రామాలు వలసలు వెళుతున్న వైనం. పల్నాడు ప్రాంతంలో ఇంతటి దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునే ప్రయత్నం ‘సాక్షి’ చేసింది.  మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం, మండాది గ్రామంలో రచ్చబండపై కూర్చున్న రైతులతో సాక్షి రిపోర్టర్‌ మాట కలిపాడు.  

మిర్చి, పత్తి దిగుబడి ఎలా ఉంది?
 అని రచ్చబండపై కూర్చున్న రైతులను ప్రశ్నించగా.. దిగుబడి కొండెక్కి ఏళ్లు గడుస్తోంది సార్‌ అని రైతు మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. నీళ్లు లేక గత ఐదేళ్ల నుంచి చేతికొచ్చిన పంటలు ఎండిపోతూనే ఉన్నాయి. బోర్లు వేస్తే చుక్కనీరు పడటం లేదు. గత ఐదేళ్లలో ఒక్కో రైతు 5–15 బోర్లు వేసి అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నాడు. అదేంటి సాగర్‌కు పక్కనే ఉన్నారు కదా!.. సాగుకు నీరు లేకపోవడం ఏంటి? అన్న ప్రశ్నకు.. ‘ఏం చేద్దాం సార్‌ మా కర్మ.. సాగర్‌కు పక్కనే ఉన్నాం. మాకు పుష్కలంగా సాగు, తాగు నీరందుతాయని అందరూ అనుకుంటారు. కానీ మా పరిస్థితి రాయలసీమ కరువు జిల్లాలకు ఏ మాత్రం తీసిపోదు’ అని మల్లారెడ్డి సమాధానం ఇచ్చాడు. 

తాగునీటికి కూడా ఇబ్బందే సార్‌.. 
ఇంతలో పక్కనే ఉన్న శ్రీనివాస్‌ మాట కలుపుతూ మాది తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి సార్‌!.. నిండుకుండలా సాగర్‌లో నీళ్లున్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏనాడూ సాగుకు సరిపడా నీళ్లు వదల్లేదు సార్‌ అని ఆక్రోశం వ్యక్తం చేశాడు. గత ఖరీఫ్‌లో సాగర్‌ నీటిమట్టం దాటి గేట్లు సైతం ఎత్తారు.. అంతకుముందు రెండేళ్లు నీళ్లున్నా సాగుకు పుష్కలంగా నీరివ్వలేదు. సాగర్‌లో నీళ్లున్నా ఇవ్వకుండా రైతులను కష్టపెట్టిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.  

10 లక్షలు ఖర్చుపెట్టా సార్‌..
 ‘నాకు 16 ఎకరాలు పొలం ఉంది. పత్తి, మిర్చి సాగు చేస్తాను. సాగుకు నీళ్లు లేక కళ్లెదుటే చేతికొచ్చిన పంట ఎండిపోతుండటం చూడలేక 10కి పైగా బోర్లు వేశా. రూ.10 లక్షలు అప్పు అయింది. కానీ చుక్కనీరు పడలేదు. గ్రామాల్లో తాగునీరు లేదు, ఉపాధి లేదు. మా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు’ అని సైదా రెడ్డి అనే రైతు  ఆవేదన వ్యక్తం చేశాడు.

జగనే మా ఆశాదీపం సార్‌.. 
 ‘చంద్రబాబుని నమ్మి మోసపోయాం. గత ఐదేళ్లలో ఆరు ఎకరాల్లో ఏడు బోర్లు వేశా. రూ.15 లక్షల అప్పులయ్యాయి. మా ఆశంతా జగన్‌మోహన్‌రెడ్డి మీదే. మా ఆశాదీపం ఆయనే సార్‌. ఆయన వస్తేనే మా ప్రాంత జీవనాడి వరికపూడిసెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నోచుకుంటుంది. మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టు నిర్మించి తీరుతామని శపథం చేశారు. లేని పక్షంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు’ అని యువ రైతు షేక్‌ మౌలాలి తెలిపాడు. 

నీరివ్వకపోగా సీమకు ఇస్తున్నామని ప్రచారం 
సీమ జిల్లాలకు నీళ్లిచ్చాడు.. నీరున్న చోట కన్నీళ్లకు చోటుండదని నమ్మిన మనిషి.. అని చంద్రబాబు తన గురించి విపరీతంగా ప్రచారాలు చేసుకుంటున్నాడు. నదుల అనుసంధానం, పోలవరంపై గ్రాఫిక్స్‌ ప్రచారాలు చేస్తూ రాజమౌళి సినిమాను తలపించి ప్రజలను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. సాగర్‌కు పక్కనే ఉన్న మాకు నీరివ్వకపోగా తప్పుడు ప్రచారాలు ఏంటి సార్‌ అని లింగారెడ్డి అనే రైతు ప్రశ్నించాడు.  

వరికపూడిసెల నిర్మిస్తే ఈ తిప్పలు ఉండేవి కావు... 
రైతు వెంకటరమణ మాట్లాడుతూ ‘పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాల్లోని 55 వేల ఎకరాల బీడు భూములకు సాగు, 10 గ్రామాలకు తాగునీరు అందించే వరికపూడిసెల ఎత్తిపోతల పథకం నిర్మిస్తే మా కష్టాలు తీరుతాయి సార్‌. ఇదే చంద్రబాబు 1996లో శిరిగిరిపాడు వద్ద వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. 2014లో సీఎం అయ్యాక అయినా నిర్మిస్తాడేమో అని ఆశపడ్డాం. నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మమ్మల్ని మభ్యపెట్టడం కోసం సాగు విస్తీర్ణం తగ్గించి, మొక్కుబడిగా నిధులు కేటాయించి చేతులు దులుపేసుకున్నాడు’ 
అని ఆగ్రహం వెలిబుచ్చాడు. 

వైఎస్‌ బతికుంటే వరికపూడిసెల పూర్తయ్యేది
రైతు మంత్రు నాయక్‌ మాట్లాడుతూ ‘దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో వరికపూడిసెల నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఆ వెంటనే 2009లో అ«ధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాడు. ఆ మహానుభావుడు బతికి ఉంటే మాకు ఈ దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి కాదు. ఈ పాటికి వరికపూడిసెల నిర్మాణం పూర్తి చేసి ఉండేవారు’ అని అన్నాడు.  

– వడ్డే బాలశేఖర్‌, సాక్షి, గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement