సాక్షి విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన పర్యటనను నిరసిస్తూ ఉత్తరాంధ్ర వాసులు ఆందోళనకు దిగడం దీనికి ప్రధాన కారణం. స్థానికుల నిరసనతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పర్యటన సాధ్యంకాదని, తిరిగి వెనక్కివెళ్లాలని పోలీసులు చంద్రబాబుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేతతో సహా.. పార్టీ నేతలంతా ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలని పోలీసు అధికారులు సూచించారు. దీంతో తీవ్ర ఆవేశం ప్రదర్శించిన చంద్రబాబు.. పోలీసులపైకి బెదిరింపులకు దిగారు. తమాషా చేస్తున్నారా.. అంటూ అక్కడున్న పోలీసులను పరుష పదజాలంతో దూషించారు. వారి సూచనలను పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారు. నాకే సూచనలు చేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (విశాఖకు జైకొడితేనే.. ముందుకు)
కాగా అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న పర్యటనను పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ‘అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు’ అంటూ గురువారం విశాఖకు వచ్చిన ఆయనకు ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబును కదలనిచ్చేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి సుమారు ఐదుగంటల పాటు చుక్కలు చూపించారు. చివరికి స్థానికులు ఆందోళన విరమించకపోవడంతో.. ఐదుగంటల హైడ్రామా అనంతరం చంద్రబాబు ఎయిర్‌పోర్టులోకి వెళ్లారు. మొత్తానికి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు వెనక్కి పంపించి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment