కాంగ్రెస్‌ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ జెండా | Chandragiri People Want to Chevireddy Bhaskar Reddy Again | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ జెండా

Published Wed, Mar 13 2019 9:20 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Chandragiri People Want to Chevireddy Bhaskar Reddy Again - Sakshi

విజయనగర సామ్రాజ్య నాలుగో రాజధాని...శ్రీ కృష్ణదేవరాయలు పాలనకు కొలువు... మకుటాయమానమైన కోటకు నెలవు... చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగానూ అంతే పేరుగాంచింది. పలువురు ప్రముఖులు ఇక్కడినుంచి పోటీ చేస్తుండటంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆసక్తి నెలకొంటోంది. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంది. 2014లో సంచలన రీతిలో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మళ్లీ బరిలో ఉండగా, టీడీపీ మాత్రం నాలుగుసార్లు గెలిచిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి జలక్‌ ఇస్తూ కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చింది.

సాక్షి, తిరుపతి : చంద్రగిరిలో సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.  వైఎస్సార్‌ సీపీ తరఫున డా.చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీడీపీ నుంచి పులివర్తి నాని బరిలో దిగనున్నారు.  సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో పాటు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌ ఈ సారి ఇక్కడినుంచి పోటీ చేస్తారన్న ప్రచారం రావడంతో చంద్రగిరి నిత్యం వార్తల్లో నిలిచింది. అంతకుముందు నుంచి ప్రతిపక్ష నేతలపై తీవ్ర నిర్బంధాలు, వారి ప్రతిఘటనలతో ఈ నియోజకవర్గ రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, వీటిన్నిటిని తట్టుకుని చెవిరెడ్డి ఎదురునిలిచారు. వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం జనంలో ఉంటూ వారికి చేరువయ్యారు.  ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని ప్రభుత్వం సహకరించకపోయినా, సొంత నిధులతో అభివృద్ధి చేశారనే పేరుంది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిధులు రూ.2 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకులు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించారు.

అసెంబ్లీ ఏర్పడిందిలా...
తిరుపతి అసెంబ్లీ పరిధిలోని చంద్రగిరి, తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలు, పూతలపట్టు నియోజకవర్గంలోని పాకాల, పుత్తూరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం, పీలేరు నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం, చిన్నగొట్టికల్లు మండలాలను కలిపి 1978లో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌ కంచుకోటలో వైఎస్సార్‌సీపీ జెండా
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1978లో ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక తొలిసారి గెలిచిందీ ఆయనే. బాబు స్వగ్రామం నారావారిపల్లి చంద్రగిరి మండలంలోనే ఉంది. ఇక్కడ పదిసార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లే టీడీపీ గెలుపొందింది. ఐదుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి డా.చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంచలనం సృష్టించి టీడీపీకి షాకిచ్చారు. మరోవైపు 1978 తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు స్వతంత్ర అభ్యర్ధి వెంకట్రామనాయుడు చేతిలో ఓడిపోయారు. 1999, 2004, 2009లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన గల్లా అరుణకుమారి హ్యాట్రిక్‌ కొట్టారు. ఆమె వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

అధికార అరాచకాలు
చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఉండటంతో టీడీపీ అధిష్టానం చంద్రగిరిపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే పులివర్తి నాని పేరును ముందే ప్రకటించింది. నాని చంద్రగిరిలో అడుగుపెట్టింది మొదలు టీడీపీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. సీఎం, మంత్రి లోకేష్‌ నేరుగా ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల సర్వేల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులను గ్రామాల్లోకి పంపి వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించే కుట్రపన్నింది. ఇలా వచ్చిన వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసులు వారిపై చర్యలు తీసుకోవటం పక్కనపెట్టి పట్టించిన గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన చెవిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు.

చిరకాల స్వప్నం తెలుగు గంగ
చంద్రగిరి వాసులు తాగునీటి అవసరాలకు తెలుగుగంగ నీరివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై పలుసార్లు సీఎం చంద్రబాబు, మంత్రులకు విన్నవించారు. అదే విధంగా కల్యాని డ్యామ్‌ నీళ్లను చంద్రగిరి నుంచి తిరుమల తీసుకెళ్తున్నారు. వాటిలో కొంత వాటా చంద్రగిరి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది. రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌ మండలాల మధ్య ఉన్న డంపింగ్‌ యార్డును తరలించాలని ప్రజలు పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు.  అయినా ప్రభుత్వం స్పందించలేదు. శెట్టిపల్లి రైతుల వ్యవసాయ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

జనం మధ్య చెవిరెడ్డి
భాస్కరరెడ్డి యువతకు క్రమంతప్పకుండా ఏటా క్రికెట్‌ టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు కృషి చేశారు. చంద్రగిరి, పాకాలలోని మార్కెట్లను సొంత నిధులతో వేలం పాటలో పాడుకుని రైతులకు అంకితం చేశారు. దీంతో రోజూ సుమారు 500 మంది రైతులు, రైతు కూలీలకు మార్కెట్‌ పన్ను కట్టే బాధ నుంచి విముక్తి కలిగింది.

గల్లాకు చెక్‌...తెరపైకి నాని
గత ఎన్నికల సమయంలో విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె చెప్పకపోయినా... చంద్రబాబు సూచనలతో ఆ మేరకు పులివర్తి నాని అసత్య ప్రచారం చేయించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు, త్వరలో అమెరికా వెళ్తున్నట్లు వదంతులు సృష్టించారు. చివరకు అవే మాటలను అరుణకుమారి చేతే చెప్పించడంలో చంద్రబాబు, లోకేష్, నాని కృతకృత్యులయ్యారు. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో ఆమె వర్గీయులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. అరుణకుమారిని కావాలనే ఎన్నికలకు దూరంపెట్టారనే అపవాదును తప్పించుకునేందుకు పులివర్తి నాని కొత్త ఎత్తుగడ వేశారు. ‘నేను ఎన్నికల్లో గెలవాలని రాలేదు. గాలివాటం ఉంటే గెలుస్తా’ అంటూ కార్యకర్తల సమావేశాల్లోనే చెప్పుకోవడం గమనార్హం. ఆరు నెలల క్రితం చిత్తూరు నుంచి దిగుమతి అయిన నాని అంటే ఎవరో పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు తెలియదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement