
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిందని, రాష్ట్రం కోరిన మీదటే ప్రత్యేక ప్యాకేజీలో పలు మార్పులు చేశామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఒప్పుకుంది? ప్యాకేజీకి ఒప్పుకోవడానికి ఏ కారణాలు చెప్పింది? ప్యాకేజీని అంగీకరించాక ఈ ప్యాకేజీని సస్పెండ్ చేయాలని గానీ, తొలగించాలని గానీ, రద్దు చేయాలని గానీ, నిలుపుదల చేయాలని గానీ కోరిందా? అందుకు కారణాలు ఏం చెప్పింది? ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయడంపై ప్రస్తుత స్థితి ఏంటి?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీనికి గోయల్ సమాధానం ఇచ్చారు. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల అనంతరం ప్రత్యేక హోదా ఉనికిలో లేదు.
ఏపీ పునర్వ్యవస్థీకరణలో నిబంధనల మేరకు నీతి ఆయోగ్ ఏపీ అభివృద్ధికి నివేదిక సమర్పించింది. ఈ సిఫారసుల మేరకు ప్రత్యేక హోదాకు దీటుగా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2016, అక్టోబర్ 24న సీఎం చంద్రబాబు లేఖ ద్వారా ప్యాకేజీని సమ్మతించారు. తదుపరి కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపిన సందర్భంలోనూ 2017, మే 2న కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశారు. ప్యాకేజీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ఐదు ప్రధాన మార్పులను మంత్రి వివరించారు.