ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్సార్‌సీసీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అందుకు పోలీసులు, బూత్‌లెవెల్ అధికారులు సహకరిస్తున్నారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 22,500కుపైగా ఓట్లను తొలగించాలని, 22,000 దొంగ ఓట్లను చేర్పించేలా దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేల పేరుతో టీడీపీ వాళ్లు ట్యాబ్‌లు తీసుకుని పల్లెల్లోకి వస్తున్నారని, ఒక్కొక్కరు రోజుకు 30 మందిని సర్వే చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తామని చెప్పిన వారి ఓటర్ ఐడీ నెంబరు, ఆధార్ నెంబర్ తదితర వివరాలను గుంటూరులోని సెంట్రల్ ఆఫీసుకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. తర్వాత ఆన్‌లైన్‌లోకి వెళ్లి నా ఓటు నేనే తొలగించుకున్నట్టు ప్రజల తరపున సెల్ఫ్ డిక్లరేషన్(అప్లికేషన్) పెట్టి, వారి ఓటు పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ సభ్యత్వం ఉన్న వారిని బూత్‌లెవెల్ అధికారులుగా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించేలా ట్యాబ్‌లతో ఇంటింటికీ వస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు 16 మందిని ట్యాబ్‌లతో సహా పోలీసులకు అప్పగించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన వారిని చిత్తూరు ఎస్పీ ఇంటికి పిలిచి మరీ కొడుతున్నారని ఆరోపించారు.
చంద్రగిరి టీడీపీ నాయకుడు ఆ నియోజకవర్గంలోని 325 పోలింగ్ బూత్ ఇన్‌చార్జిలతో ఇటీవల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వాయిస్ రికార్డులను, ఆధారాలను ఎన్నికల సంఘానికి అందజేసినట్లు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ ఇన్‌చార్జిలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ నాయకుడు ఒకరు మాట్లాడిన మాటలివీ..
టీడీపీ నేత: మీరు గట్టిగా పనిచేసి తలో ఇరవై ఓట్లు తొలగించేలా చూడాలి. అలా ఓ పది వేల ఓట్లు తొలగిస్తారు. మనకు అనుకూలంగా 5 వేల ఓట్లు చేర్పించామనుకో దానికి మించినటువంటి ఫలితం మరొకటి ఉండదు. మన వాళ్లందరికీ ఈ విషయం చెప్పిండి. మీరు మరో రెండు రోజులు బూత్ దగ్గరే ఉండి అనుకూల ఓట్లు చేర్పించాలమ్మా.
బూత్ లెవెల్ కార్యకర్త: అన్నా.. మనకు పడే ఓట్లకు సంబంధించి వారి ఆధార్ కార్డులు తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ అడ్రస్ లేకపోతే ఓట్లు ఎలా చేర్పించాలి?
టీడీపీ నేత: ఓకేనమ్మా.. నువ్వు వారి వివరాలు తీసుకుని ఒకసారి రా. మనవాళ్లు ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసేస్తారు. వారికి కొత్త ఓట్లు చేర్చేలా అప్లికేషన్ పెట్టొచ్చు. మనకు అనుకూలమైన ఓట్లు అడ్రస్ మార్చి చేర్పించొచ్చు. అదంతా చిటికెలో పని.
టెలికాన్ఫరెన్స్ నిర్వాహకుడు: అన్నా.. సీఎంగారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించే టైమ్ అయ్యింది. మీరు కట్ చేస్తే ఆయనకు లైన్ కలపాలి.
టీడీపీ నేత: అదేంటి.. సార్ టెలికాన్ఫరెన్స్ ఉందని చెప్పలేదు. సరే అది అయ్యాక మళ్లీ మాట్లాడుతా.
టెలికాన్ఫరెన్స్ నిర్వాహకుడు : అన్నా.. ఈ రోజు ఇంక కుదరదు. సీఎంగారి టెలికాన్ఫరెన్స్ ఎంత సమయం పడుతుందో తెలియదు. మీరు రేపే మాట్లాడుకోండి.
Comments
Please login to add a commentAdd a comment