న్యూఢిల్లీ: ఉగ్రవాద గ్రూపులకు మద్దతునివ్వడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పాకిస్థాన్ రాజకీయ నాయకుల తీరు మారడం లేదు. బాహాటంగా పాక్ నాయకులు ఉగ్ర మూకలతో అంటకాగుతున్నారు. తాజాగా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి పర్వేజ్ ఖట్టక్ లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రహమాన్ మక్కీతో వేదిక పంచుకోవడం గమనార్హం.
ఒకప్పటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన పర్వేజ్ ఖట్టక్ ఆదివారం పెషావర్‌లో జరిగిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మక్కీ కూడా ఉన్నారు. మక్కీ బావ, ముంబై దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయీద్. మక్కీ కూడా ఉగ్రవాద కేసులలో నిందితుడిగా ఉన్నాడు.
ఈ సమావేశంలో సయీద్ పాల్గొనకుండా పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరుడుగట్టిన మతవాద గ్రూపులను మచ్చిక చేసుకునేందుకు సీఎం పర్వేజ్ ఖట్టక్ ఈ భేటీలో పాల్గొన్నట్టు స్థానిక డాన్ పత్రిక వ్యాఖ్యానించింది. దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్‌ను పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో ఖట్టక్ పాల్గొనడం పలువురిని ఆశ్చర్యపరిచింది. 40కిపైగా ఇస్లామిక్ అతివాద రాజకీయ పార్టీలతో కూడిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ దేశంలో సంప్రదాయ విధానాలను పాటించాలని ప్రవచిస్తూ ఉంటుంది. ఈ గ్రూప్ తరచూగా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment