ఎంతోమంది వార్నింగ్‌ ఇచ్చారు | Chintakayala Ayyanna Patrudu comments on Reservations | Sakshi
Sakshi News home page

ఎంతోమంది వార్నింగ్‌ ఇచ్చారు

Published Sat, Oct 21 2017 7:49 PM | Last Updated on Sat, Oct 21 2017 7:54 PM

Chintakayala Ayyanna Patrudu comments on Reservations

విశాఖపట్నం: కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి రిజర్వేషన్‌ వర్తింపజేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఏపీ రహదారులు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ‘ఇప్పటికి ఐదుసార్లు మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను.. రిజర్వేషన్లు తొలగించాలని 1983 నుంచి చాలాసార్లు చెప్పాను.. దీన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది వార్నింగ్‌ ఇచ్చార’ని గుర్తుచేశారు.

అక్కయ్యపాలెం మెయిన్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కోఆరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ శాటిలైట్‌ బ్రాంచిని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకురావడానికి ఆరోజు అంబేద్కర్‌ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారన్నారు. ఇచ్చిన వాళ్ళకే మళ్లీమళ్లీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న రూల్‌ ఎక్కడా లేదన్నారు. ఒక వ్యక్తి రిజర్వేషన్‌పై ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయితే ఆయన కొడుకు కూడా అదే రిజర్వేషన్‌పై ఐఏఎస్‌ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలా ఒకే కుటుంబానికి రిజర్వేషన్లు పరిమితం కాకుండా అన్ని వర్గాలకు రిజర్వేషన్లు దక్కాలన్నారు.

రాజులు, బ్రాహ్మణులు, కమ్మ వంటి ఆగ్రకులాల్లో పేదవారు లేరా అని ప్రశ్నిస్తూ పేదరికం చూసి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన సూచించారు. లేని వాడికి ఆర్ధిక సాయం అందించి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. తన కులంలో కూడా కోటీశ్వరులు, పేదవారు ఉన్నారు. కోటీశ్వరుడికి రిజర్వేషన్‌ కాకుండా పేదవాడికి అందించాలని అయ్యన్నపాత్రుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement