ఏలూరులో తలసేమియా కేంద్ర విభాగాన్ని ప్రారంభిస్తున్న సీఎం
ఏలూరు (మెట్రో)/ఏలూరు టౌన్: వ్యవసాయ రంగాన్ని కేంద్రం నాశనం చేస్తుంటే తాను ప్రశ్నించానని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) శత వార్షికోత్సవంలో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన రైతుల సభలో సీఎం మాట్లాడారు. రైతు ఆదాయం రెండింతలు అభివృద్ధి చేస్తానని మోదీ చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదనీ, తాను మాత్రం 11 శాతం అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రైతులకు లబ్ధి చేకూర్చే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మాటేమిటని కేంద్రాన్ని ప్రశ్నించానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటికి, ఎరువులకు కొరత లేకుండా చూశామని చెప్పారు.
రైతు రుణమాఫీ విషయంలో ధైర్యంగా తాను ముందడుగు వేస్తే మోదీ మాత్రం ఇవ్వలేనని చేతులెత్తేశారన్నారు. ప్రధాని మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోందన్నారు. అలాగే, వ్యవసాయంలో ఉపాధి హామీ పథకం (నరేగా)ను అమలుచేయాలని తాను కోరిన ఫలితంగానే కేంద్రం కమిటీ వేసిందని సీఎం చెప్పారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటోందని, మోసం చేస్తోందని, అయినా సాధించుకుంటామని చెప్పారు. ప్రతిపక్షాన్ని బీజేపీ ఆటలాడిస్తోందని, పవన్‌కళ్యాణ్‌ను తనపైకి ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. గతంలో తన పాట పాడిన పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీ పాట పాడుతున్నారన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు కేంద్రం అడ్డుతగులుతోందన్నారు. కనీసం తాను నిర్మాణం చేస్తానన్నా సహకరించట్లేదన్నారు. కాగా, ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి రెడ్‌క్రాస్ భవనంలో తలసేమియా, హిమోఫీలియా వ్యాధిగ్రస్తుల చికిత్సా భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు పూర్తిస్థాయిలో ఔషధాలను సమకూర్చడంతోపాటు నెలకు రూ.2 వేలు పెన్షన్‌గా అందిస్తామని చెప్పారు.
గేట్లు వేసి.. రైతులను బంధించి..
ఇదిలా ఉంటే.. రైతుల సభకు హాజరైన వారిని బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు వేసి బంధించడం విమర్శలకు తావిచ్చింది. సభకు జిల్లావ్యాప్తంగా వెయ్యిమందికి పైగా రైతులు, మహిళలు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మ.1.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన సభ గంటన్నర ఆలస్యంగా మొదలైంది. తదుపరి టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రసంగాలు కొనసా..గాయి. దీంతో రైతులు సభాప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవటం మొదలెట్టారు. 3.45కు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించగానే రైతులు భారీసంఖ్యలో బయటకు వెళ్లిపోసాగారు. గమనించిన పోలీసు అధికారులు గేట్లు వేసేసి.. రైతులు బయటకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో మమ్మల్ని బయటకు వెళ్లనీయండి బాబోయ్ అని రైతులు గగ్గోలు పెట్టారు. ఇలా బంధించి ఇబ్బంది పెడితే ఎలాగని అసహనం వ్యక్తంచేశారు. నినాదాలకు దిగారు. పరిస్థితి విషమించటంతో పోలీసులు గేట్లు తీయగా రైతులు, మహిళలు బయటకు పరుగులు తీశారు.
టీడీపీలో చేరండి : అశోక్‌బాబుకు సీఎం ఆదేశం
ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబును తమ పార్టీలో చేరాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం మంగళవారం ఏలూరులో జిల్లా ఎన్‌జీఓ హోంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల తరఫున పోరాటాలు చేస్తున్న అశోక్‌బాబు ప్రజలకు సేవచేయడం ఎంతో అవసరమన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అశోక్‌బాబును ఎప్పుడో కోరానని.. ఈ మేరకు ఎప్పుడో పార్టీలోకి రమ్మన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పోటీచేయాలని అశోక్‌బాబును సీఎం కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పిస్తున్నానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment