సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బీజేపీకి వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. నెరుల్ ప్రాంతంలో అక్రమ వలసదారుల కోసం నిర్భంద కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న గత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదనను ఉద్ధవ్ థాక్రే మంగళవారం రద్దు చేశారు. మహారాష్ట్రలో నిర్భంద కేంద్రాలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో జనవరి 22న ఎన్నార్సీపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే ఎన్నార్సీ అమలుపై తమ వైఖరి వెల్లడిస్తామని ఉద్ధవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నార్సీ అమల్లోకి వస్తే భారతదేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీ పౌరులు, చొరబాటుదారులను గుర్తించేందుకు వీలుంటుంది. అలాంటి వారిని వారి స్వదేశానికి పంపిస్తారు. ఒకవేళ ఏదేశమైనా వాళ్లను తమ పౌరులు కాదని తిరస్కరిస్తే, అలాంటి వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారు. కాగా, ఇప్పటికే సీఏఏపై దేశంలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 22న ఎన్నార్సీపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. చదవండి : రాహుల్ గాంధీని కొట్టండి
Comments
Please login to add a commentAdd a comment