శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏకాభి ప్రాయం వ్యక్తంచేశారు. దేశంలో పలు దఫాలుగా ఎన్నికలు జరుగుతుండటంతో ఇబ్బందులు వస్తున్నాయని, అలాకాకుండా పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పక్షాలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ శనివారం మోదీని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన 11 అంశాలపై 17 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. హైకోర్టు విభజన, కొత్త జోనల్ వ్యవస్థ, రిజర్వేషన్ల పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, పెండింగ్‌లోని రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం తరఫున రూ.20 వేల కోట్ల సాయం అందజేయాలని కోరారు. అలాగే హైకోర్టు విభజన ఆవశ్యకతను మరోసారి గట్టిగా వినిపించారు. హైకోర్టు విభజన జరగనిదే రాష్ట్ర విభజన సంపూర్ణం కాదని స్పష్టంచేశారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దేశంలో ఏకకాల ఎన్నికలపైనా చర్చించినట్టు తెలిసింది.
మీరు వెళ్తే.. మేమూ వస్తాం..
డిసెంబర్ లేదా జనవరిలో జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన కేంద్రానికి ఉంటే తామూ అదే దారిలో ఉంటామని కేసీఆర్ ప్రధానికి చెప్పినట్టు తెలిసింది. కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలను సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై ప్రధాని తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పకపోయినా... ‘‘4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే కేంద్రం కూడా ముందస్తుకు వెళ్తే బాగుంటుం దని అనుకుంటున్నారా..’’అని కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సమయంలో ఐదేళ్లకోసారి డిసెంబర్ లేదా జనవరిలో లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీనికి మోదీ స్పందిస్తూ ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’ అన్న తమ విధానంలో మార్పు లేదన్నట్లు తెలిసింది. అందుకు తామూ సిద్ధమేనని, ఇదే అభిప్రాయాన్ని ఇటీవల లా కమిషన్ ముందు వ్యక్తపరిచినట్టు కేసీఆర్ వివరించారు. దేశంలో పలు దఫాలుగా ఎన్నికలు జరగడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఇరువురు అభిప్రాయపడ్డారు. బీజేపీయేతర నేతలతో జనవరి 19న కోల్‌కతాలో ఫెడరల్ ఫ్రంట్ ర్యాలీ చేపడతామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. దీనికి కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలు హాజరవుతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపైనా ప్రధాని, సీఎం చర్చించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment