ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓట్ల శాతం ఐదు నుంచి పది శాతం వరకు అదనంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్ 16, ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తాయన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం ఇక్కడ ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది.
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కేంద్రం వద్ద పెండింగ్ అంశాల పరిష్కారం, లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను మనమే గెలవాలి. దీని కోసం ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. మీ పరిధిలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో మీకు తెలుసు. వాటిని వెంటనే సరిచేసుకోవాలి. ఎమ్మెల్యేలు మీ కంటే తక్కువ స్థాయి అయినా మీ గెలుపు కోసం తిరిగేది వారే. వారితో సమన్వయంగా ఉండాలి. కలసి పనిచేయాలి. అందరితో మంచిగా మాట్లాడితే పోయేదేమీ ఉండదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితిని వెంటనే చక్కదిద్దుకోవాలి. తుమ్మ ల నాగేశ్వర్‌రావు, మిగిలిన ముఖ్యలు కలసి మాట్లాడుకోండి. లోక్‌సభ ఎన్నికలు మనకు పూర్తి అనుకూలంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో మన పార్టీ ఓట్ల శాతం 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటా యో మనకు సమాచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న ఏడు స్థానాలను ముందే గుర్తించి అభ్యర్థులను మార్చాం. అన్ని స్థానాల్లో గెలిచాం. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం పనిచేయండి. మనదే గెలుపు’అని కేసీఆర్ అన్నారు.
పెండింగ్ అంశాలపై పోరాటం: జితేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత ఎ.పి.జితేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటు అంశం సహా అన్ని విషయాలపై కేంద్రాన్ని నిలదీస్తాం. బైసన్ పోలో గ్రౌండ్‌ను సచివాలయం కోసం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తాం. అనేక పెండింగ్ అంశాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ 33 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. 52 అంశాలపై జాతీయ స్థాయిలో పోరాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల వద్దకు వెళ్లి మరోసారి వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. జనవరి 1 నాటికి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ విషయంలో జాప్యం చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ ఆదేశించారు’అని కేసీఆర్ అన్నారు.
సమస్యలపై పోరాటం..
‘కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ స్పందించడంలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బీజేపీ మంత్రులు మాత్రం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రానికి లేఖలు రాస్తే రా యలేదని చెప్పారు. ఎంపీలందరూ కలసి ఢిల్లీ లో మీడియా సమావేశం నిర్వహించి మనం రాసిన లేఖలను విడుదల చేయండి. రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్‌లో గట్టిగా పట్టుబట్టాలి. సాగునీటి ప్రాజెక్టుల కు కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో గట్టిగా కొట్లాడాలి. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రతిపాదనపైనా పార్లమెంట్‌లో పోరాడాలి. కేంద్రం ఏ విషయంలో ఎలా నిర్లక్ష్యంగా ఉందో ఎండగట్టాలి. రాష్ట్రానికి సంబం ధించిన 52 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పునర్విభజనలో పెట్టినవి గట్టిగా అడగాలి. సోమవారం నుంచి అధికారులు మీకు ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. కొన్ని రోజల తర్వాత నేను ఢిల్లీకి వస్తా. పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లోనే వస్తా. అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా ప్రయత్నాలను గట్టిగా కొనసాగించాలి’అని కేసీఆర్ అన్నారు.
పుస్తక ప్రేమికుల మన్ననలు పొందుతుంది
‘బుక్‌ఫెయిర్’పై సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 25 వరకు నిర్వహించనున్న 32వ ‘బుక్ ఫెయిర్’ పుస్తక ప్రేమికుల మన్ననలు పొందుతుందని సీఎం కేసీఆర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సహకారం తో హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఉన్న తెలంగాణ కళాభారతి వేదికగా జరగనున్న బుక్ ఫెయిర్ శనివారం ప్రారంభం కానుంది.
గురువారం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కె.చంద్రశేఖర్‌రావును ప్రగతి భవన్‌లో కలిసి అభినందనలు తెలుపుతున్న రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు జి.రాజేశం గౌడ్
Comments
Please login to add a commentAdd a comment