ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీలు కె. కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, సంతోష్ తదితరుల
రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న పలు అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూల స్పందన పూర్తిగా కరువైంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. పైగా వివిధ పథకాల కింద రాష్ట్రాలకు విడుదల చేసే నిధులను అర్ధాంతరంగా ఆపేసింది.
రాష్ట్రాల్లేకుండా కేంద్రానికి మనుగడ లేదనే అంశాన్ని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చింది. విభజన చట్టం హామీలను గాలికొదిలేసింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎంత మేర ప్రాధాన్యం లభిస్తుందో చూసిన తర్వాత పార్లమెంటులో నిలదీద్దాం.
సాక్షి, హైదరాబాద్: ‘కొత్త రాష్ట్రమైనా ప్రగతిశీల విధానాలతో ముందుకు సాగుతున్న తెలంగాణపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష పరాకాష్టకు చేరింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయాలపై గట్టిగా నిలదీద్దాం. అవసరమైతే బడ్జెట్ సమావే శాలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగుదాం. దేశమంతా దద్దరిల్లేలా కొట్లాడదాం..’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సుమారు ఐదు గంటల పాటు జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.
పార్లమెంటు బడ్జెట్ (2022) సమావేశాల్లో టీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు పార్టీ అధినేత దిశా నిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలతో పాటు వివిధ సందర్భాల్లో రాష్ట్ర అభివృద్ధికి సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ వచ్చిన మొత్తం 23 అంశాలకు సంబంధించిన పూర్వాపరాలను కేసీఆర్ వివరించారు. ఆయా అంశాలపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఎంపీలకు అందజేశారు.
బుక్‌లెట్‌లో పేర్కొన్న ప్రతి అంశంపైనా సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని లోతుగా విశ్లేషించారు. ఆయా అంశాలపై ఉభయ సభల్లో నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కలిసి వచ్చే పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పారు. కేంద్రం వైఖరిపై అసంతృప్తిని తెలిపేందుకు సోమవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనా చర్చ
సుదీర్ఘంగా సాగిన టీఆర్‌ఎస్‌పీపీ భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పార్టీవర్గాల కథనం ప్రకారం.. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే ఫలితాల వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జాతీయ స్థాయిలోనూ ఎండగట్టేందుకు పార్లమెంటును వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలు లోతుగా అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలోనే మరోమారు పార్లమెంటరీ పార్టీ భేటీని ఏర్పాటు చేసే అంశాన్ని కేసీఆర్ సూచాయగా ప్రస్తావించారు.
రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్ష నేత డాక్టర్ కె.కేశవరావు, లోక్‌సభ నేత నామా నాగేశ్వర్‌రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్‌సభ సభ్యులు బీబీ పాటిల్, పి.రాములు, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, హన్మంతు షిండే, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.
బడ్జెట్‌పై ఆశాజనకంగా ఉన్నాం
కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఆశాజనకంగా ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రానికి పలు లేఖలు రాశారు. బడ్జెట్‌లో వాటికి సంబంధించి ఏమేమి అంశాలు ఉంటాయో లేదో చూసిన తర్వాత మాట్లాడతాం.
– రంజిత్‌రెడ్డి, ఎంపీ, చేవెళ్ల
టీఆర్‌ఎస్‌పీపీలో ప్రస్తావనకు వచ్చిన ముఖ్యాంశాలు..
► షెడ్యూలు 9,10లోని సంస్థల విభజన
► అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణ
► వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు (ఏటా రూ.450 కోట్లు)
► కాళేశ్వరానికి జాతీయ హోదా (రూ.20 వేల కోట్లు)
► రైల్వే ప్రాజెక్టులు వేగవంతం, కొత్త రైల్వే లైన్లు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ
► బైసన్‌పోలో భూమి అప్పగింత, హెచ్‌ఎంటీ అభివృద్ధి
► ఐఐఎం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ, ఐటీఐఆర్‌కు నిధులు
► 23 నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటు
► ఎన్టీపీసీలో స్థానికులకు ఉద్యోగాలు
► ములుగులో గిరిజన యూనివర్సిటీ
► రామప్ప గుడి అభివృద్ధి
► మిషన్ భగీరథకు ఆర్దిక సాయం
► బయ్యారంలో స్టీల్ ప్లాంటు
► కొత్త జాతీయ రహదారులు, రోడ్ల విస్తరణ
► ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ
► హైదరాబాద్‌లో ఎన్‌ఐడీ, నిమ్జ్‌కు నిధులు
► రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ, ముస్లింలకు రిజర్వేషన్లు
► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
► హైదరాబాద్ – నాగపూర్, హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
► కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.1,000 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment