సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సర్పంచ్ స్వప్నారెడ్డి చేత హైకోర్టులో పిటిషన్ వేయించారని కేసీఆర్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటించారు.
పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికోసం అవసరమైన కసరత్తు పూర్తి చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సంబంధిత అధికారులనూ ఈ భేటీకి పిలిచి అన్ని విషయాలను సమగ్రంగా చర్చించి పంచాయతీరాజ్ సంస్థల్లో 61 శాతం రిజర్వేషన్ల అమలు అవసరాన్ని నొక్కి చెప్పేలా వాదనలు ఖరారు చేయాలని సూచించారు.
నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ...
పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశం కానుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలోనూ రిజర్వేషన్ల విషయంలో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు కూడా సుప్రీంకోర్టు అనుమతితోనే 60.55 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలను నిర్వహించింది. 2013 ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలోనూ హైకోర్టులో రిజర్వేషన్లపై పిటిషన్ దాఖలైంది. అప్పుడూ సైతం హైకోర్టు... రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లు 50 శాతం వరకే ఉంటే... బీసీలకు ప్రస్తుతం ప్రతిపాదించిన 34 శాతం కాకుండా 23.81 శాతమే ఉంటాయి. ఇప్పటికే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి భిన్నంగా గత ఎన్నికల కంటే కోటా తగ్గితే బీసీ వర్గాల నుంచి అసంతృప్తి తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గ ఉప సంఘంలో ఈ మేరకు చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment