
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు శాసన సభలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు నాయుడు దాదాపు 50 నిమిషాలు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇతర అంశాలు మాట్లాడుతూ.. సభా సమయాన్ని వృథా చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కలుగజేసుకొని ప్రతిపక్ష నాయకుడు సభను తప్పుదోవ పట్టిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
21మంది టీడీపీ సభ్యుల్లో ఐదుగురు మాట్లాడితే.. 151మంది ఉన్న తమ సభ్యుల్లో కేవలం ఏడుగురు మాత్రమే మాట్లాడారని గుర్తు చేశారు. ప్రజలు నిద్రపోయేవరకు మాట్లాడాలనే ఉద్ధేశంతోనే చంద్రబాబు ఇంకా మైకు వదలడం లేదని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడేది ప్రజలు వినకూడదని చంద్రబాబు అనుకుంటున్నారని.. అయినప్పటికీ ఆయనకు మరింత సమయం ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ కలగజేసుకొని చంద్రబాబును 10 నిమిషాల్లో ప్రసంగం ముగించాలని ఆదేశించగా.. మరో గంట సమయం కావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ‘అసెంబ్లీ టీడీపీ జాగీరు కాదని.. ఇది అందరిదీ.. ప్రతి ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని’ స్పష్టం చేశారు.