
సాక్షి, అమరావతి : ప్రభుత్వంపై బురద జల్లే దురుద్దేశపూరిత కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకురావాలన్న జీవో నంబర్ 2430పై ప్రతిపక్ష టీడీపీ మరోసారి రాద్ధాంతం చేసింది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు గురువారం అసెంబ్లీలో లేవనెత్తడంతో దీనిపై శాసనసభా పక్ష నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభ వేదికగా దీటుగా బదులిచ్చారు. జీవో కాపీని క్షుణ్ణంగా చదివి సభ్యులకు వివరించిన ఆయన మాట్లాడుతూ.. ‘2430 జీవోను రద్దు చేయమని కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ జీవోను అసలు చంద్రబాబు చదివారా? అందులో ఏం తప్పుంది? నాకు తెలిసి ప్రతిపక్ష నేతకు ఇంగ్లీష్ రాక, జీవో అర్థం చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారని భావిస్తున్నా.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసేవారికే ఈ జీవో వల్ల ఇబ్బంది అని మరోసారి స్పష్టం చేస్తున్నా. ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తే, మేం పడాలా? ఆధారాల్లేకుండా నిందలు, ఆరోపణలు చేస్తుంటే అధికారులు వాటిని మోస్తూ ఉండాలా? మా హక్కులకు భంగం కలిగితే ప్రశ్నించకూడదా? పరువు నష్టం దావా వేసే హక్కు కూడా లేదా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. నలభై సంవత్సరాల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ఎద్దేవా చేశారు.