13 జిల్లాల సమగ్ర అభివృద్ధి | Comprehensive development of 13 districts | Sakshi
Sakshi News home page

13 జిల్లాల సమగ్ర అభివృద్ధి

Published Sat, Jan 11 2020 4:01 AM | Last Updated on Sat, Jan 11 2020 7:57 AM

Comprehensive development of 13 districts - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు పేర్నినాని, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని

సాక్షి, అమరావతి: పరిపాలన ఒకేచోట కాకుండా వికేంద్రీకరణ ఎలా చేయాలి.. 13 జిల్లాల్లో సమాంతరంగా, సమంగా అభివృద్ధి ఎలా జరగాలనే దానిపై చర్చించినట్లు వికేంద్రీకరణపై ఏర్పాటైన హైపవర్‌ కమిటీ తెలిపింది. అభివృద్ధి కేవలం ఒకేచోట కేంద్రీకృతం కావడంవల్ల ఎంతో నష్టపోయినట్లు గత చరిత్ర చెబుతోందని.. అది పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వివరించింది. అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడతామని కమిటీ తెలిపింది. జీఎన్‌ రావు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదికలతోపాటు రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం, శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికలన్నింటిపై చర్చించినట్లు వివరించింది.

హైపవర్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధ్యక్షతన కమిటీ రెండో సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. వివరాలను కమిటీ సభ్యులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణారావు వివరించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే అంశంపై చర్చించినట్లు పేర్ని నాని తెలిపారు. ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు రాకుండా, అవి పెరిగే అవకాశాలు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలన అన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతం కావాలనే దానిపై సభ్యులు చర్చించినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధిలో తనక్కూడా భాగస్వామ్యం ఉందని ప్రతిఒక్కరూ భావించేలా నిర్ణయాలు తీసుకోవాల్సి వుందన్నారు. ఈ నెల 13న కమిటీ మరోసారి సమావేశమవుతుందని, ఆ సమావేశంలో దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని పేర్ని నాని తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం, డిమాండ్, సూచనలను హైపవర్‌ కమిటీ   చర్చిస్తుందని ఆయన స్పష్టంచేశారు. 
హైపవర్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన. చిత్రంలో మంత్రులు ఉన్నతాధికారులు  

చంద్రబాబుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అక్కర్లేదా? 
కమిటీ సభ్యులు కన్నబాబు, మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి అక్కర్లేదా.. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టంలేదా అని ప్రశ్నించారు. తన సొంత సంపద కోసం అమరావతిని సృష్టించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన చంద్రబాబుకు మిగతా ప్రాంతాలు నాశనమైపోయినా పర్వాలేదా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే హైపవర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వారు స్పష్టంచేశారు. కాగా, ఏడు నెలల సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన ఒక యజ్ఞంలా జరుగుతుంటే దాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఎందుకు అపోహలు సృష్టించాలనుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

బాబు పాలనలో అణచివేత
కాగా.. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ విశాఖ వెళ్తే ఎయిర్‌పోర్టులో నిర్బంధించి తిరిగి వెనక్కి పంపింది.. అదే ఉద్యమం చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేసింది.. కాపుల హక్కుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభంను అణచివేసి, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబే అని మోపిదేవి, కన్నబాబు విమర్శించారు. తన పాలనలో ఇష్టానుసారం అణచివేతకు పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం, గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఇసుక, ఇంగ్లిష్‌ మీడియం, రాజధాని అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం  పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement