ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు , డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో ఆసక్తికర పోరు నడుస్తోంది. తాతామనవడి మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. తాత వరుసైన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మనవడి వరుసైన డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మధ్య ప్రస్తుతం నువ్వానేనా అన్నట్టుగా వివాదం రాజుకుంటోంది. పార్టీ టిక్కెట్ విషయంలో కుమ్మలాటలకు దారితీస్తోంది. రాజకీయ భిక్ష పెట్టిన తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని రాజాపై సుబ్బారావు మండిపడుతుండగా, ఎదిగేందుకు ఇదే మంచి అవకాశంగా సుబ్బారావుకు దీటుగా రాజా పావులు కదుపుతున్నారు. వీరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరులో టీడీపీ శ్రేణులు నలిగిపోతున్నాయి. ‘ముందుకెళితే గొయ్యి – వెనక్కి వెళితే’ నుయ్యి అన్నచందంగా తయారైంది.
తాతా, మనవళ్ల గంతులాట...
ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా తాతా, మనవళ్లుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు నెరుపుతున్నారు. సుబ్బారావు సోదరుడు మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనువడిగా రాజా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఈయన తండ్రి తమ్మారావు రాజకీయాలకు కాస్త దూరంగా ఉండేవారు. మాజీ ఎమ్మెల్యే జోగిరాజు తర్వాత ఆ కుటుంబం నుంచి వరుపుల సుబ్బారావే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి నీడలో రాజా మెలుగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే పార్టీ తరఫున డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయం సాధించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తరఫున డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న వరుపుల రాజా ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈయన టీడీపీలో చేరిన కొన్నాళ్ల తర్వాత వరుపుల సుబ్బారావు వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించారు. మొత్తానికి తాతా,మనవళ్లు ఇద్దరు ఫిరాయింపు నేతలుగానే నియోజకవర్గంలో కొనసాగుతున్నారు.
ఈ సారి తనకే టిక్కెట్టంటూ...
ఎన్నాళ్లీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా కొనసాగుతామని... ఎదగడానికి ఇంతకన్నా మంచి సమయం దొరకదని భావించారో ఏమో తెలియదు గాని తాత సుబ్బారావుకు దీటుగా రాజా నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం ప్రారంభించారు. మంత్రి యనమల రామకృష్ణుడి అనుచరుడిగా ఎదిగేందుకు ఆరాటపడుతున్నారు. ఆయన అశీస్సులతో రానున్న ఎన్నికల్లో టిక్కెట్ సాధించాలన్న యోచనతో ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలో కీలక నేతగా ఉన్న మంత్రి లోకేష్‌తో కూడా సన్నిహిత సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ విధంగా పార్టీలో పట్టు సాధించడంతో ఈసారి ఎలాగైనా తనకే టిక్కెట్ వస్తుందని, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రకంగా ఎమ్మెల్యే సుబ్బారావుకు సెగ పెట్టడమే కాకుండా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో ప్రత్యామ్నాయంగా తయారయ్యారు.
ఆత్మరక్షణలో ఎమ్మెల్యే ...
చాపకింద నీరులా మనువడైన రాజా ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తుండటమే కాకుండా ఎమ్మెల్యే సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారని సుబ్బారావు గ్రహించి అప్రమత్తమయ్యారు. జరుగుతున్న పరిణామాలు జీర్ణించుకోలేని విధంగా ఉండటంతో రాజాను టార్గెట్ చేయడం ప్రారంభించారు. రాజకీయ బిక్ష పెట్టిన తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని, ఈసారి తనకే టిక్కెట్ అంటూ చెప్పుకుని తిరుగుతున్నారని, రాజకీయ ఓనమాలు దిద్దిన తనకే ఎసరు పెడుతున్నారని రాజాపై ఒంటికాలిపై లేవడం మొదలుపెట్టారు. అసలు రాజాకు టిక్కెట్ వచ్చేది లేదని, ఆయన వద్దకు ఎవ్వరూ వెళ్లొద్దని హుకుం జారీ చేస్తున్నారు. రాజా దగ్గరకు వెళితే తన వద్దకు రానవసరం లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. గత కొన్ని రోజులగా రాజాను లక్ష్యంగా చేసుకుని తన నివాసంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తనకు అన్యాయం చేసేందుకు రాజా యత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఇప్పటికే ప్రతికూలత – ఆపై రాజా సెగ...
ఇప్పటికే నియోజకవర్గంలో అంతర్గత పోరు ఉండటం...ఇప్పుడు కొత్తగా రాజా ప్రతికూలంగా తయారవడంతో సుబ్బారావు తట్టుకోలేకపోతున్నారు. ఫిరాయింపు నేతగా నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. టీడీపీకి అమ్ముడుపోయి గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచారని చెడ్డపేరును మూట గట్టుకున్నారు. గత ఎన్నికల్లో తన వెనుకున్న వారిలో చాలా మంది వైఎస్సార్‌సీపీలో ఉండటంతో పరిస్థితి ప్రతికూలంగా ఉంది. దీనికితోడు టీడీపీ పాత నాయకులుగా ఉన్న దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులతో ఏమాత్రం పొసగడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పనుల్లో చిట్టిబాబు వర్గీయులుగా ఉన్న పర్వత రాజబాబు అనుచరులకు మొండి చేయి చూపించడంతో వారంతా లోలోపల రగిలిపోతున్నారు. అంతేకాకుండా పార్టీలో అణగదొక్కే విధంగా వ్యవహరించడంతో ఎప్పటికప్పుడు పర్వత రాజబాబు వర్గీయులు తిరగబడుతున్నారు. వీరంతా సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, టీడీపీ పాత నేత పర్వత రాజబాబు వర్గీయుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీటు ఫైటు మొదలవడంతో సుబ్బారావుకు కంటి మీద కునుకు ఉండటం లేదు.
అయోమయంలో తమ్ముళ్లు...
ఒకవైపు టిక్కెట్ తనకే వస్తుందని వరుపుల రాజా చెప్పుకుంటుండగా, మరోవైపు రాజాకు ఛాన్సే లేదని..టిక్కెట్ నాకే దక్కుతుందని...రాజా వద్దకు వెళితే నా దగ్గరకు రావొద్దని...అక్కడికి వెళ్లిన వారికి ప్రాధాన్యత ఇవ్వనంటూ సుబ్బారావు హెచ్చరించడంతో టీడీపీ శ్రేణులు ఇరకాటంలో పడ్డాయి. ఎవరి వద్దకు వెళితే ఏం జరుగుతుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం–విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా టీడీపీ శ్రేణుల పరిస్థితి తయారైంది. వీరి మధ్య నడుస్తున్న అంతర్గత పోరులో నలిగిపోతున్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment