రాజకీయ పార్టీలతో భేటీ అనంతరం బయటకు వస్తున్న రావత్, రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో నాలుగో వంతు బోగస్ ఓట్లేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంది. ఓటర్ల జాబితాలో 65 లక్షలకు పైగా బోగస్ ఓట్లున్నాయని తాము హైకోర్టును ఆశ్రయిస్తే, ఈ లోపాలన్ని సరిచేశామంటూ ఎన్నికల సంఘం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శించింది.
ఈ జాబితాపై మళ్లీ హైకోర్టులో కేసులు వేయబోతున్నామని ప్రకటించింది. శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన జరిపేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లవాస బృందం సోమవారం ఇక్కడి ఓ హోటల్‌లో గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు సేకరించింది. ఈసీ బృందంతో భేటీ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు.
మంత్రులకు నోటీసులు సరికాదు: టీఆర్‌ఎస్
మంత్రులు అనధికారిక పర్యటనలకు వెళ్లినా పెయిడ్ న్యూస్‌గా పరిగణించి నోటీసులు జారీ చేయడం సరికాదని చెప్పగా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషర్ రావత్ సానుకూలంగా స్పందించారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ వెల్లడించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్, కరీంనగర్ నగరాల్లో అభివృద్ధి పనులు కొనసాగించేందుకు అనుమతి కోరినట్టు చెప్పారు. నగదు, మద్యం పంపిణీని నియంత్రించి ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు సీఈఓ రజత్‌కుమార్ నేతృత్వంలో తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశామని పేర్కొన్నారు. ఈసీతో సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేసింది..
తుది ఓటర్ల జాబితాలో తప్పులు ఇంకా పెరిగాయని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ తరఫున మలక్‌పేట నియోజకవర్గం లో నమూనా సర్వే నిర్వహించగా ఏకంగా 13,523 బోగస్ ఓట్లు బయటపడ్డాయని, అందులో 622 ఓటర్ల పేర్లు పునరావృతమయ్యాయని తెలిపారు.
పెద్ద సంఖ్యలో అర్హుల పేర్లను తొలగించారని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఎక్కడ ఏం జరిగినా టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తమ పార్టీ నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ గ్రామాల్లో డబ్బులు, మద్యాన్ని వరదలా పారిస్తోందని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
పోటీపై త్వరలో నిర్ణయం: వైఎస్సార్‌సీపీ
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ విపరీతంగా డబ్బుల పంపి ణీ చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేత శివకు మార్ ఆరోపించారు. కాంట్రాక్టర్ల డబ్బు లతో బహిరంగ సభలు నిర్వహిస్తోందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసేవరకు మద్యనిషేధం అమలు చేయాల న్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేసే అంశంపై పార్టీ అధి నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: కాంగ్రెస్
3.74 కోట్ల మంది ఓటర్లతో ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో 65 లక్షల బోగస్ పేర్లున్నాయని, నాలుగో వంతు బోగస్ ఓటర్లతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, జంధ్యాల రవిశంకర్ ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన ఆధార పత్రాలను ఈసీ బృందానికి చూపించినట్టు చెప్పారు. ఈ ఆరోపణలను ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసీకి సవాల్ విసిరినట్టు తెలిపారు.
ఈసీ తన సాంకేతిక బృందాన్ని తీసుకొస్తే, తాము ఎల్‌సీడీ తెరలపై బోగస్ ఓటర్ల జాబితాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నెల 12న రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను అందిస్తామని పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయిందని విమర్శించారు. ఈఆర్వో నెట్ వెట్‌సైట్లో సైతం ఓటర్ల జాబితాలను చూడడం కష్టంగా మారిందన్నారు.
2015లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఓటర్ల జాబితా నుంచి 15 లక్షల ఓటర్లను తొలగించారని ఆరోపించారు. భన్వర్‌లాల్ బదిలీకి ప్రతిపాదనలు పంపించాలని అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నసీమ్ జైదీ ఆదేశిస్తే.. ఆ ప్రతిపాదనలను కేసీఆర్ తొక్కిపెట్టారని విమర్శించారు. తమ ఫిర్యాదులను ఈసీ బృందం కేవలం నమోదు చేసుకుందని, చర్యలకు ఎలాంటి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
బతుకమ్మ ఆడితే అరెస్టు చేశారు..
హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో బోగస్ ఓటర్లను తొలగించకుండానే తుది ఓటర్ల జాబితాలను ప్రకటించారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో మీడియా, ఏటీఎం వాహనాలు, అంబులెన్స్‌ల ద్వారా డబ్బుల పంపిణీ జరగకుండా చర్య లు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు. చార్మినార్ వద్ద బతుకమ్మ ఆడిన తమ పార్టీ నేతలను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్ సహకరించడం లేదని, సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలని ఇంద్రసేనారెడ్డి సూచించారు.
అధికారులను శిక్షించాలి: చాడ
బోగస్ ఓటర్లను తొలగించని అధికారులను శిక్షించాలని.. ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీని అరికట్టి సామాన్యులకు సైతం పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల తండాలకు 20 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ బూత్‌లు ఉండటంతో గిరిజనులు ఓటు వేయలేకపోతున్నారని, ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడి చెప్పారు. కాగా, ఎన్నికల సంఘంతో సమావేశంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment