
అమేధిలో నేడు రాహుల్ నామినేషన్..
లక్నో : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేధి లోక్‌సభ స్ధానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. కాగా రాహుల్ నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా ఆయన వెంట యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ ప్రతినిధి అనిల్ సింగ్ వెల్లడించారు.
కాగా,నామినేషన్ వేసేముందు రాహుల్ 3 కిమీ పరిధిలో సాగే రోడ్‌షోలో పాల్గొంటారని సింగ్ తెలిపారు. మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేస్తున్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమేధిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.