సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ ధాటికి హస్తం అభ్యర్థులు కొట్టుకుపోయారు. రాహుల్ నాయకత్వ పటిమకు పరీక్షగా నిలిచిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన పూర్తిగా తేలిపోయారు. కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వకుండా బీజేపీ చరిత్రలోనే అత్యధిక స్థానాలకు ఆ పార్టీకి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ దారుణమైన ఓటమి చవిచూడడం మరోవైపు ఆ పార్టీకి కంచుకోట వంటి అమేథిలో రాహుల్ ఓడిపోవడం అధిష్టానం జీర్ణించుకోలేని అంశం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకునేందుకు ఢిల్లీలో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. ఈ సమావేశంలోనే రాహుల్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సమావేశంలో ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
కాగా రాహుల్ నాయకత్వంపై విమర్శలు రాకముందే.. పార్టీ పదవి నుంచి వైదొలగాలని రాహుల్, సోనియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి సోనియా గాంధీ విముకత వ్యక్తం చేశారని, పదవికి రాజీనామా చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా రాహుల్ రాజీనామా వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తీవ్రంగా ఖండించారు. కాగా యూపీలో ఆపార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment