సాక్షి, న్యూఢిల్లీ: తన కుటుంబ సభ్యులతో సమానమైన అమేథి నియోజకవర్గ ప్రజలు తమ అమూల్యమైన ఓటువేసి తనను గెలిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అమేథి లోక్‌సభ అభ్యర్థి రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు లేఖ రాశారు. ‘మేరా అమేథి పరివార్’ అంటూ సంబోధిస్తూ రాసిన ఈ లేఖలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. బీజేపీ అబద్ధాల కర్మాగారమని, ఓటర్లకు ప్రవాహంలా డబ్బును పంచిపెడుతూ మభ్యపెడుతున్నారని లేఖలో ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు ఇక్కడి ప్రజలకు చేరకుండా అమేథిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటన్నింటిన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంలో అంబానీ వంటి ఇరవై మంది పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి యజమానిగా వ్యవహిరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలే యజమానులని రాహుల్ స్పష్టం చేశారు. నిజాయితీ, సమగ్ర అనే అంశాలే అమేథీ నియోజకవర్గ బలాలని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే మూడు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించిన రాహుల్.. నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీనే బీజేపీ ఈసారి బరిలో నిలిపింది. రాహుల్ తరపున ఆయన చెల్లెలు, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటికే అమేథిలో పలుమార్లు పర్యటించారు. ఈనెల ఆరున అమేథి స్థానానికి ఎన్నిక జరుగునున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment