గిరీష్ చోదన్కర్
పనాజి: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రానికి శాశ్వత సీఎంను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పరిశీలిస్తోంది. దీనిని నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పనాజిలోని మాజీ సీఎం దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదన్కర్ మాట్లాడుతూ... మూడు నెలలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరని, ముగ్గురు మంత్రుల బృందాన్ని వెంటనే తొలగించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్ర పరిస్థితిని గవర్నర్‌కి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ఏలాంటి స్పందన లేదని విమర్శించారు.
త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది. దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించడం గమనార్హం. బందోద్కర్ స్థాపించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment