girish chodankar
-
గోవా పీఠంపై మళ్లీ బీజేపీ!
చిన్న రాష్ట్రం గోవాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మరీ అధికార బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లు గెలుచుకుంది. శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. జీఎఫ్‌పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 2, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూటమికి 3 సీట్లు వచ్చాయి. తృణమూల్ కూటమిలో ఉన్న ఎంజీపీ రెండు సీట్లు సాధించింది. ముగ్గురు స్వతంత్రులు నెగ్గారు. ఎంజీపీకి చెందిన ఇద్దరు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో బీజేపీ బలం 25కు చేరింది. గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం ఇక లాంఛనమే. ఎంజీపీ తమకు బేషరతుగా మద్దతునిచ్చేందుకు అంగీకరించిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు బీజేపీ గోవా ఎన్నికల ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ నూతన సారథి ఎవరన్నది పార్టీ నాయకత్వమే నిర్ధారిస్తుందని ప్రమోద్ సావంత్ అన్నారు. కొత్త ప్రభుత్వంపై మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి ప్రాతినిధ్యం కల్పించాలా, లేదా ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు. శుక్రవారం జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో దానిపై స్పష్టత వస్తుందన్నారు. గోవా ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడాంకర్ స్పందించారు. నాన్–బీజేపీ ఓట్లు చీలిపోవడం వల్లే కమలం పార్టీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 33.31 శాతం, కాంగ్రెస్ 23.46 శాతం ఓట్లు సాధించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ ఓటమి చెందడం గమనార్హం. -
‘మా రాష్ట్రానికి సీఎం కావాలి’
పనాజి: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రానికి శాశ్వత సీఎంను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పరిశీలిస్తోంది. దీనిని నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పనాజిలోని మాజీ సీఎం దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదన్కర్ మాట్లాడుతూ... మూడు నెలలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరని, ముగ్గురు మంత్రుల బృందాన్ని వెంటనే తొలగించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్ర పరిస్థితిని గవర్నర్‌కి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ఏలాంటి స్పందన లేదని విమర్శించారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది. దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించడం గమనార్హం. బందోద్కర్ స్థాపించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. -
‘అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందే’
పనాజీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గోవా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సెక్రటరీ గిరిశ్ చోదాంకర్ డిమాండ్ చేశారు. గోవా ప్రజలు బీజేపీయేతర ప్రభుత్వం కోసం ఓట్లు వేశారని, కానీ, అభిప్రాయాన్ని గౌరవించకుండా వేరే మార్గంలో మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని పక్కకు పెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇది ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా చేసిన చర్య అని ఈ నేపథ్యంలో అమిత్ షా గోవా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బలవంతంగా అమిత్ షా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఆరోపించారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని, కానీ మరోమార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9న గోవాలో ఓ భారీ బహిరంగా సభను రాష్ట్ర బీజేపీ ఏర్పాటుచేస్తుంది. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కృషి చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఈ సభలో సన్మానించనున్నారు.