మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘జెండా పట్టేందుకు మనుషులే లేరు. కాంగ్రెస్ దుకాణం ఖాళీ అవుతుంటే వంద సీట్లు గెలుస్తామంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పండి. టీఆర్‌ఎస్ ఎందుకు ఓటేయాలో వంద కారణాలు చెబుతాం. టీఆర్‌ఎస్ చేసే అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని. ప్రజలకు కష్టాలు తెలిసినవాళ్లం గనక.. ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తామ’’ని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ మండలంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు సర్పంచులు, ఎంపీటీలు, పెద్దఎత్తున్న కార్యకర్తలు శుక్రవారం మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
కరీంనగర్‌లోని టీవీగార్డెన్‌లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సభకు మంత్రి హరీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కరీంనగర్‌ను ఆనుకొని వెళ్తున్న గోదావరిని ఉభయగోదావరి జిల్లాల్లో పారించి, కరీంనగర్‌లో రక్తం పారించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. మూడున్నరేళ్లలో గోదావరిపై అద్భుతరూపల్పన చేశామని, ఉభయగోదావరి జిల్లాలను తలదన్నే విధంగా కరీంనగర్‌ను ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గోదావరి నీటితో తెలంగాణను దేశానికి అన్నం పెట్టే కల్పవల్లిగా మారుస్తామన్నారు. ఇక నుంచి రైతులు వర్షం కోసం మొగులును చూడాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి, కడెం. ప్రాణహిత ఇలా ఏ నది నుంచి నీల్లు వచ్చినా ప్రతి చుక్కా కరీంనగర్ నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని, కరీంనగర్ గొప్ప జిల్లాగా రూపుదిద్దుకుంటుందని హరీష్‌రావు అన్నారు.
ప్రజలు టీఆర్‌ఎస్ వైపు ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన నిలబడేందుకు అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు నాయకులంతీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. జాతీయ పార్టీలు రాష్ట్రాలను ఢిల్లీలో బిచ్చగాల్లను చేస్తాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో మీట నొక్కితే ఇక్కడి సీఎం కదిలే పరిస్థితి ఉండేదన్నారు. టీఆర్‌ఎస్ ఏ పనిచేసినా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని, ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు, పక్క రాష్ట్రాల మంత్రులు ఇక్కడికి వచ్చి మన పథకాల గురించి తెలుసుకొని అద్బుతమంటూ కీర్తిస్తున్నారని అన్నారు. మరో అతిథి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నీళ్లలో పాలు కలిసినట్టుగా పాత, కొత్త తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతామన్నారు.
కేసీఆర్ మొదలు పెట్టిన గొప్ప మానవ ప్రయత్నం కాళేశ్వరం ప్రాజెక్టు అని, వచ్చే వర్షాకాలం నాటికి తెలంగాణలో కరువంటే ఏమిటో తెలియకుండా చేస్తామన్నారు. గతంలో పదేండ్లు గడిచినా పూర్తి కాని ప్రాజెక్టులు, ప్రస్తుతం రెండేండ్లలో పూర్తిచేసే కమిట్‌మెంట్, పనితనం టీఆర్‌ఎస్ స్వంతమన్నారు. ఉద్యమాన్ని కడుపులో పెట్టుకుని కాపాడిని జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ అక్బర్ హుస్సేన్, నగర మేయర్ రవీందర్‌సింగ్, జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మెన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment