సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆకర్షించేలా ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని లక్షలాది మంది నేత కార్మికులను ఆదుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చేనేత, పవర్‌లూమ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పించాలని మేనిఫెస్టోలో ప్రతిపాదించనుంది. దీంతోపాటు ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కూడా కల్పిస్తామని హామీ ఇవ్వనుంది.
ఈ అంశాలతోపాటు సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కో–చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. టీఆర్‌ఎస్ పాలనలో నేత కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, బతుకమ్మ చీరలన్నీ సిరిసిల్ల నేతన్నలకే ఇస్తామని చెప్పి సూరత్, ముంబైల నుంచి కిలోల లెక్కన చీరలు తెప్పించి అన్ని వర్గాల్లాగానే నేత కార్మికులనూ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవడమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో..
ఇప్పటికే అనేక వర్గాల నుంచి వినతులు స్వీకరించిన దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఈ నెల 27న రాహుల్ గాంధీ పాల్గొనే రెండో బహిరంగ సభ అనంతరం మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వచ్చిన వినతులను విభాగాలవారీగా వర్గీకరించి వాటిలోని ముఖ్యాంశాలతో ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దీనికి తుది రూపు ఇచ్చే ముందు ప్రధాన వర్గాలు, ఆ వర్గాల ముఖ్యులతో భేటీ కావాలని నిర్ణయించింది.
ఈ నెల 27కు ముందే ఓ రోజంతా వర్క్‌షాప్ ఏర్పాటు చేసి కార్మిక, చేనేత, సింగరేణి, ఉపాధ్యాయ, ఆర్టీసీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఉద్యోగ సంఘాలతో భేటీ కావాలని భావిస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీపై రాహుల్ తన ప్రసంగంలోనే ప్రకటన చేయగా రెండో బహిరంగ సభలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ ఏర్పాటు అంశాలను ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు రద్దు అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించగా దీన్ని రాహుల్‌తోనూ చెప్పించాలని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. రాహుల్ ప్రకటించే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతామని, ప్రజాకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ చెబుతున్నారు.
ముసాయిదా మేనిఫెస్టోలో ప్రధానాంశాలు..
♦ రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ, రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులను సాధారణ రైతులుగా గుర్తించి రైతుబంధు సహా అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు.
♦ క్వింటాలు రూ. 2 వేలకు వరి, మొక్కజొన్న కొనుగోలు. పత్తి రూ. 7 వేలకు, మిర్చి రూ. 10 వేలకు కొనుగోలు.
♦ రైతులకు పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.
♦ 10 లక్షల నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి.
♦ పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్.
♦ తొలి ఏడాదే ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో లక్ష ఉద్యోగ అవకాశాల కల్పన.
♦ ప్రతి మహిళా సంఘానికి రూ. లక్ష గ్రాం ట్, రూ. 10 లక్షల రుణం.
♦ వికలాంగులకు పెన్ష న్ రూ. 3,000కు పెంపు.
♦ వృద్ధులు, వితంతువు లు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్ రూ. 2 వేలకు పెంపు.
♦ ఇళ్లు లేని ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాం గులకు రూ. 6 లక్షలు.
♦ 58 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు. అర్హులైన భార్యాభర్తలిద్దరికీ పెన్షన్లు (ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు వర్తింపు).
♦ ఇంది రమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి రూ.2 లక్షలు.
♦ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు, పరిమితి రూ.5 లక్షలకు పెంపు.
♦ తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలు.
♦ అన్ని బీపీఎల్ కుటుంబాలకు ఏటా ఆరు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం.
♦ 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా.
♦ రేషన్ ద్వారా బియ్యం, గోధుమలతో పాటు మరి న్ని పప్పుధాన్యాలు.
♦ గల్ఫ్ బాధితుల కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు.
♦ గల్ఫ్ లో మరణించిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment