కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలివే | T Congress Manifesto Will Be Released On November 23rd | Sakshi
Sakshi News home page

సుపరిపాలన.. సంక్షేమం

Published Thu, Nov 22 2018 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

T Congress Manifesto Will Be Released On November 23rd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుపరిపాలన.. అమరులు, ఉద్యమకారుల సంక్షేమం.. రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం.. విద్య, వైద్య రంగంలో సంస్కరణలు.. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలకు ఆర్థిక చేయూత... జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్‌ మేనిఫెస్టోను సిద్ధం చేసింది. 35 అంశాలను మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరచనున్న అన్ని హామీలను అందులో చేర్చింది. ఈ మేనిఫెస్టోకు సమూల మార్పు కోసం సమగ్ర ప్రణాళిక అంటూ ట్యాగ్లైన్‌ పెట్టింది. ఈనెల 23న మేడ్చల్‌లో జరగనున్న ఎన్నికల సభలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ సమక్షంలో.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహా, కో–చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ పీపుల్స్‌ మేనిఫెస్టోను ప్రజల ముందుంచనున్నారు.  

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు.. 
అమరుల కుటుంబాలకు..: 2009 తర్వాత ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం. అమరుల కుటుంబాల్లో అర్హులకి పింఛన్, ఆరోగ్యకార్డు, ఉచిత బస్‌పాస్, డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు. 
 
అన్నదాతకు..: ఒకే దఫా రూ.2 లక్షల వ్యవసాయ రుణ మాఫీ, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పెట్టుబడి సాయం రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంపు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌. వ్యవసాయ పంపుసెట్లపై రూ.83 కోట్ల విద్యుత్‌ సర్వీస్‌ చార్జీల ఎత్తివేత. 17 రకాల పంటలకు గిట్టుబాటు ధర.. వరి, మొక్కజొన్న, సజ్జ, జొన్నలకు క్వింటాల్‌కు రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, కందులు, మినుములు, పెసలుకు రూ.7 వేలు, వేరుశనగ, పొద్దుతిరుగుడుకు రూ.5 వేలు, మిర్చి, పసుపుకు రూ.10 వేలు, ఎర్ర జొన్నలు రూ.3 వేలు. 
 
సాగు నీటి ప్రాజెక్టులు: సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ తగిన నిధులు, త్వరితగతిన పూర్తి చేసి ఒక కోటి ఎకరాలకు సాగునీరు. డా. బీఆర్‌ అంబేద్కర్‌ సుజల స్రవంతి ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ కట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి బ్యారేజీకి పూర్తిస్థాయిలో నీటి తరలింపు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు షేక్‌ హ్యాండ్‌ బ్యారేజీలను కట్టి జల విద్యుత్, సాగునీరు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును, రంగారెడ్డి, చేవెళ్ల ప్రాంత రైతులకు ఉపయోగడేలా ప్రణాళిక. 
 
నిరుద్యోగులకు..: నిరుద్యోగ యువతకు రూ.3వేల భృతి. 20వేలతో మెగా డీఎస్సీ, పాత విధానంలో కొనసాగింపు. యూపీఎస్సీ, ఎస్సెస్సీ తరహాలోనే ఉద్యోగ వార్షిక క్యాలెండర్‌ ద్వారా గ్రూప్‌–1, 2, 3 తదితర పోస్టుల భర్తీ. ప్రభుత్వ శాఖల్లో ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. రాష్ట్ర ఖజానాలో 20 శాతం ఆదాయం విద్యకు వెచ్చింపు. 
 
జర్నలిస్టులకు..: రూ.200 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి. 58 ఏళ్లు నిండినవారికి పింఛన్‌. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ. 2 లక్షలతో పాటు ఐదేళ్ల పాటు నెలకు రూ. 5వేల ఆర్థిక సాయం. జర్నలిస్టు హెల్త్‌ స్కీంను పకడ్బందీగా అమలు చేసి ఇందులో అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా చర్యలు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు  
 
మరికొన్ని..: రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ అమలు. ఆర్టీఐ చట్టం సమగ్ర అమలు.. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ జీవోలు. పత్రిక, మీడియా భావ స్వాతంత్రను కాపాడటం. ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల వ్యాధులకు రూ.5 లక్షల వరకు వర్తింపు. అర్హులకు ఇంటి స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు. ఇందిరమ్మ ఇళ్ల అదనపు గది నిర్మాణానికి రూ.2 లక్షలు సాయం. పాత బకాయిల చెల్లింపు. ఎస్సీ వర్గీకరణ అమలకు చర్యలు, మాదిగ, మాల, ఇతర ఉపకులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు. మైనార్టీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్, ఇమామ్‌ల గౌరవ వేతనం రూ.6వేలకు పెంపు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే జీతభత్యాలు. రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, వెలమ కులాల వారికి వేర్వేరు కార్పొరేషన్లు. ఈబీసీ విద్యార్థులకు రూ.25 లక్షల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌. మహిళల వివాహ ఆర్థిక సాయం రూ.1,50,116లకు పెంపు.
 
తెల్లరేషన్‌ కార్డు వారికి 6 ఎల్పీజీ సిలిండర్లు ఉచితం. మహిళా సంఘాలకు రుణాల పరిమితి రూ.10లక్షలకు పెంపు, ఒక్కో సంఘానికి రూ.లక్ష గ్రాంటు. సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలయ్యేలా కృషి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి 60 ఏళ్లకు పెంపు. రూ. 300 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధి. బార్‌ కౌన్సిల్‌కు ఏటా రూ. 10 కోట్లు. ప్రతి జిల్లా కేంద్రంలో అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు. ప్రభుత్వ స్కూళ్లకు వేళ్లే విద్యార్థులకు రూ. 300 నుంచి 500 వరకు స్కాలర్‌ షిప్‌. ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి పథకానికి ప్రోత్సాహకాలు, వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి, ఉద్యోగావకాలు కల్పిస్తాం. ట్రాన్స్‌జెండర్‌లుగా గుర్తించిన వారికి నెలకు రూ. 3వేల ఫించన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. 58 ఏళ్లుపైబడిన వృద్ధులందరికీ వృద్యాప్య పింఛన్లు. రూ. వేయి నుంచి రెండు వేలకు పెంపు. 70 ఏళ్లు పైబడిన వారికి రూ.3 వేలు. జీహెచ్‌ఎంసీని స్థానిక ప్రభుత్వంలా గుర్తించి అన్ని అధికారాలు బదలాయించి తగినన్ని నిధులు కేటాయింపు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న మురకి వాడల సమగ్ర అభివృద్ది కోసం స్లమ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు. పోలీసులకు వారంత సెలవు ఖచ్చితంగా అమలు, ప్రతి మూడు నెలలకోసారి హెల్త్‌ చెకప్‌. క్రీడాకారులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 3శాతం రిజర్వేషన్లు అమలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement