సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తించబోతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభతో ప్రచార హోరును మరింత ఉధృతం చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో సోనియా, రాహుల్ పాల్గొంటున్న సభను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ స్థాయిలో జనసమీకరణతో సభ విజయవంతం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి...
రాష్ట్రం అధికారికంగా ఏర్పాటైన తర్వాత తొలిసారి సోనియా రాష్ట్రానికి వస్తుండటంతో కాంగ్రెస్ కేడర్లో నూతనోత్తేజం నెలకొంది. ప్రతీ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో రావాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా సభా వేదికపైనే భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీపీసీసీ పెద్దలు తెలిపారు. అదే విధంగా రాహుల్‌కు సైతం సన్మానం చేయనున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్ బయలుదేరి సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ టీపీసీసీ ముఖ్య నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తారు. అక్కడి నుంచి 5.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 6గంటల కల్లా మేడ్చల్‌లోని బహిరంగ సభకు చేరుకుంటారు. సభలో దాదాపు 45 నిమిషాల పాటు సోనియా ప్రసంగం చేయనున్నారు. రాహుల్ 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా 116 పేజీల కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను సోనియా ఆవిష్కరించనున్నారు. ప్రసంగంలో ప్రధానంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలకు వివరించి, తమ నేతృత్వంలో అభివృద్ధి చేస్తామని సోనియా హామీ ఇవ్వనున్నట్లు టీపీసీసీ నేతలు తెలిపారు.
అభ్యర్థులంతా వేదికపైనే...
బహిరంగ సభ వేదికపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో పాటు కీలక నేతలు మొత్తం 200 మంది ఉంటారని కాంగ్రెస్ నేతలు స్పష్టంచేశారు. కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బహిరంగ సభ ప్రాంగణంలో ఇప్పటికే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) నిర్వహించింది. భద్రతాపరంగా భారీగా పోలీసులను బహిరంగ సభ ప్రాంగణంలో రాష్ట్ర పోలీస్ శాఖ నిమగ్నం చేసింది.
చేరికలపై గోప్యత...
అధికార టీఆర్‌ఎస్ నుంచి వరుస వలసలు సంచలనం రేపుతున్నాయి. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. శుక్రవారం సోనియా సభలో అధికారికంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అదే విధంగా ఆయనతో పాటు కొంత మంది టీఆర్‌ఎస్ రాష్ట్ర కేడర్ నేతలు, జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇకపోతే మరో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ పెద్దలకు కనుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే నేతల పేర్లను ప్రకటించకుండా సోనియా సభలో చేరికలుంటాయని రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరన్న విషయాలను మాత్రం కాంగ్రెస్ గోప్యంగా ఉంచాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరుతున్నవారు ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment