కేసీఆర్‌ కుటుంబం గజదొంగల ముఠా.. | Congress launches campaign in Telangana | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబం గజదొంగల ముఠా..

Published Fri, Oct 5 2018 1:08 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress launches campaign in Telangana - Sakshi

సాక్షి, గద్వాల :  నాలుగున్నర ఏళ్లపాటు తెలంగాణను దోచుకున్న గజదొంగల ముఠా కేసీఆర్‌ కుటుంబమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ శక్తిపీఠంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అలంపూర్‌తో పాటు గద్వాలలో రాత్రి పొద్దు పోయే వరకు గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోచైర్మన్‌ డి.కె.అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలైంది..  
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలైందని చెప్పడానికి ఇక్కడకు వచ్చిన జనాలే నిదర్శనమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పని అయిపోయిందన్నారు. నాలుగేళ్ల దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధమవుతోందన్నారు. దళితులు, గిరిజనులు, ముస్లింలు, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులు.. ఈ విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే కేసీఆర్‌ కుటుంబం దోపిడీ దొంగల్లాగా తెలంగాణను దోచుకుంటోందని అన్నారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబం, తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా పరిగణించాలని కోరారు.

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్‌ మోసం చేశాడని, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం ఇలా.. అన్ని హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇలాంటి అబద్ధాల కోరు, మోసగాణ్ణి హైదరాబాద్‌ భాషలో బట్టేబాజ్, ధోకేబాజ్‌ అంటారని అన్నారు. కేసీఆర్‌ నరేంద్ర మోదీ ఏజెంట్‌ అని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు ముస్లింలు, మైనార్టీలను మోసం చేసేందుకు జరుగుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని అన్నారు.

టీడీపీతో జతకడితే విమర్శిస్తున్న కేసీఆర్, టీడీపీ పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు మంత్రి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మహేందర్‌రెడ్డి, తుమ్మల లాంటి తెలంగాణ ద్రోహులను పక్కన కూర్చోబెట్టుకుని పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు.. తమ పొత్తులపై మాట్లాడే అర్హత లేదన్నారు. 30 ఏళ్ల వయసు వరకు దేశ సరిహద్దులో దేశం కోసం తాను పనిచేశానని, ఆ వయసులో కేసీఆర్‌ పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌గా పనిచేశాడని, దేశం కోసం పోరాడిన తనను విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు.

కర్నూల్‌లో చదువుకున్న యువతను ప్రస్తుతం నాన్‌లోకల్‌గా పరిగణిస్తున్నారని, అయితే కాంగ్రెస్‌ అ«ధికారంలోకి వస్తే లోకల్‌గా పరిగణించి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 4500 మంది రైతులు ఆర్థికభారంతో ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్‌ పరామర్శించలేదని అన్నారు. ప్రభుత్వం రైతులకు నాలుగు విడతల్లో చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని మండిపడ్డారు.  

మేం చేసేది ఇదీ..
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. వరి, మొక్కజొన్నకు రూ..2వేల చొప్పున, పత్తికి రూ.6 వేలకు తక్కువకాకుండా, మిర్చిని రూ.10 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు మెగా డీఎస్సీ ద్వారా 20 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు.

అంతేకాకుండా సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, బీడీ, చేనేత కార్మికుల పెన్షన్‌ను రెండింతలు ఇస్తామన్నారు. 58 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని ప్రకటించారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నా పెన్షన్‌ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా దీనిని అమలు చేస్తామని వెల్లడించారు. అమ్మహస్తం కింద 9 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వడమే కాకుండా రేషన్‌కార్డు ద్వారా ఒక్కరికి ఏడు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తామన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, ప్రతీ విద్యార్థికి వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని అన్నారు. మహిళా సం ఘాలకు రూ.10 లక్షల రుణం ఇవ్వడమే కాకుం డా ప్రభుత్వం తరఫున వడ్డీ చెల్లిస్తామన్నారు. నిరుపేద, మధ్యతరగతి వారికి తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, ఇండ్ల నిర్మాణానికి నిరుపేదలకు రూ.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడి మహబూబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోæజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఉత్తమ్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  

నడిగడ్డ నుంచి శంఖారావం..
మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అరాచక పాలనను అంతం చేసేందుకు నడిగడ్డ నుంచే కాంగ్రెస్‌ శంఖారావాన్ని పూరించిందని చెప్పారు. మూడు సార్లు వరుసగా గెలిపించిన గద్వాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నానని చెప్పారు. ఏం అవసరమొచ్చిందని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ప్రశ్నించారు. పాలమూరు ప్రజల సెంటిమెంట్, ఆర్డీఎస్‌ను వాడుకొని కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని అన్నారు. జోగుళాంబ, జమ్ములమ్మ ఆశీర్వాదంతో కాంగ్రెస్‌ విజయభేరి మొదలైందన్నారు.  

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ..
సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీతో పొత్తుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని.. గతంలో టీఆర్‌ఎస్‌కే కాంగ్రెస్‌ సీట్లు ఇచ్చిందని గుర్తించాలని సూచించారు. అబద్ధాలకోరుకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


సోనియా గాంధీకి కానుకగా ఇద్దాం
ఎందరో ప్రాణ త్యాగాలు, అవమానాలు, సుదీర్ఘపోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దొరలకాళ్ల దగ్గర తాకట్టు పెట్టినట్లయిందని.. దొరల గడీల పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి పిలుపునిచ్చారు. 2014లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఆ తర్వాత మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రజలకు మంచి చేస్తాడనే భావనతో గత నాలుగేళ్లుగా ప్రశ్నించకుండా గౌరవించానని తెలిపారు.

కాగా, తొమ్మిదో చెల్లిగా కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పిన కేసీఆర్‌.. ఉద్యమంలో తోడుగా ఉన్న ఈ రాములమ్మను ఏ కారణంతో టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారో చెప్పాలని నిలదీశారు. తనను మోసం చేసినా పట్టించుకోలేదని, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసేందుకు సిద్దమవుతోందని. టీఆర్‌ఎస్‌ నాయకుల నుంచి డబ్బు తీసుకొని కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాలని ఆమె కోరారు. తద్వారా తెలంగాణలో గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇద్దామని అన్నారు.

తెలంగాణ బిల్లును పాస్‌ చేయించా..
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ బిల్లును తానే పార్లమెంట్‌లో పాస్‌ చేయించానని అన్నారు. 1969లో తాను ఎమ్మెల్యే అయినప్పుడు కేసీఆర్‌ చెడ్డీలు వేసుకుంటున్నాడని విమర్శించారు. తనను విమర్శించే నైతికత కేసీఆర్‌కు లేదన్నారు. ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా, భగీరథ పేరుతో నీళ్లు ఇవ్వకుండా దళితుడి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మాటలు తప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

తెలంగాణను వ్యతిరేకించిన వారిని కేబినెట్‌లో పెట్టుకొని ఉద్యమకారులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను, ఆయన పార్టీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఈ సభలో కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, సలీం అహ్మద్, పొన్నం ప్రభాకర్, ఒబెదుల్లా కొత్వాల్, పవన్‌కుమార్, స్నిగ్దారెడ్డి, శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా అవసరాలే కాంగ్రెస్‌ ఎజెండా
ప్రజా అవసరాలే కాంగ్రెస్‌ పార్టీ ఎజెండా అని కాంగ్రెస్‌ ప్రచారకమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు. కేసీఆర్‌ పాలనను అంతం చేస్తేనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నిజామాబాద్‌ సభలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ను కించపరిచే విధంగా మాట్లాడాడని, ఇకనైనా ఆయన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement