సాక్షి, హైదరాబాద్: సమాజ సామరస్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు. అలాంటప్పుడే రాజకీయ నాయకులు.. ఇది సరికాదని తెలుసుకుంటారన్నారు. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు.
రైతుబంధుపై వివరణ ఇవ్వాలి
మరోవైపు రేషన్ డీలర్ల సమస్య విషయంలో ప్రభుత్వం దిగి వచ్చినందుకు అభినందిస్తున్నామన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కోసమే పథకం అయితే పర్వాలేదు. కానీ పథకం లక్ష్యం నెరవేరటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద లెక్కలు లేకపోవటంతో వ్యవసాయం చేసే వారికి నష్టం జరుగుతుందన్నారు. రైతుబంధు పథకాన్నీ స్వాగతిస్తూనే.. నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వివరాలు, సూచనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని, వ్యవసాయం చేసే వారికి మాత్రమే సహాయం అందాలన్నారు. అవసరమైతే పట్టాదారుల నుంచి సాగుదార్లకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment