పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు! | Telangana Government Clarification On Crop Purchases In Rural Areas | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!

Published Mon, Dec 28 2020 12:46 AM | Last Updated on Mon, Dec 28 2020 1:08 AM

Telangana Government Clarification On Crop Purchases In Rural Areas - Sakshi

ఆదివారం ప్రగతి భవన్‌లో వ్యవసాయంపై ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేటీఆర్, బి. వినోద్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, రాజీవ్‌శర్మ తదితరులు

లాభాలొచ్చే చోట అమ్ముకోవచ్చు...
ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారీ ఇలా చేయడం సాధ్యంకాదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు పంటలను లాభమొచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి.

సర్కారుకు రూ.7,500 కోట్ల నష్టం
తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు తదితర పంటల కొనుగోళ్లతో దాదాపు రూ.7,500 కోట్ల నష్టం వచ్చింది. రైతులకు మద్దతు ధర చెల్లించి కొన్నా, ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్‌ లేక తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో నష్టం వాటిల్లింది.  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో సర్కార్‌ భారీగా నష్టపోయిందని, వచ్చే ఏడాది నుంచి ఇలా కొనడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. నియంత్రిత సాగు విధానం సైతం ఇకపై అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. రైతుబంధు పంపిణీతో సహా వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్న వారందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు–ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగిందని వెల్లడించింది. 

లాభాలొచ్చే చోట అమ్ముకోవాలి...
‘ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతీసారి ఇలా చేయడం సాధ్యంకాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. కొనుగోళ్లు–అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు పంటలను లాభమొచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్‌కు పంట తీసుకురావాలో నిర్ణయించాలి. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలి. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలి ’అని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.  చదవండి: (మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి)

సర్కారుకు రూ.7,500 కోట్ల నష్టం...
తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు, పొద్దు తిరుగుడు, మినుములు తదితర పంటల కొనుగోళ్లతో ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు నివేదించారు. రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసినా, ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్‌ లేక ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని అభిప్రాయపడ్డారు. 

వ్యవసాయ శాఖపై ఇతర బాధ్యతలు..
‘వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతు బీమా ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ చెల్లించాల్సి వచ్చేది. రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని వారి పేర రిజిస్టర్‌ చేయించడంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. సాగుకు 24 గంటల ఉచి త విద్యుత్‌ సరఫరా, సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మం దులు రైతులకు అందేట్లు చూడాలి. కల్తీలను, నకిలీలను గుర్తించి అరికట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలి. కొత్త వంగడాలను సృష్టిం చాలి. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి’అని అంతా అభిప్రాయపడ్డారు. 

నియంత్రిత సాగు అవసరం లేదు...
‘రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. ఈ విధానం ఉత్తమం. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతోంది. ఈ వేదికల్లో రైతులు, అధికారులు సమావేశం కావాలి. స్థానిక, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనేది నిర్ణయించాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి’అనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. 

28 నుంచి రైతుబంధు పంపిణీ 
నేటి నుంచి వచ్చే నెల (జనవరి–2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు, ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 రబీ సీజన్‌ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్లను పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంక్‌లో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement