సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఐసీయూలో ఉందని, గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తిప్పికొట్టారు. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్ల మాదిరి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేసిన పనులేవో వివరించి జనం మనసు గెలవాలని హితవు పలికారు. 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ నేతలు.. నీతులు చెప్తున్నారని చురకలంటించారు. మురళీధర్ రావుకి అంత నమ్మకం ఉంటే.. కరీంనగర్ నుంచి ఎందుకు పోటీచేయలేదని పొన్నం ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ నేతలు కవిత, వినోద్‌ను ఓడించాలన్నదే ప్రజల అభిమతమని.. అంతేగాని బీజేపీపై అభిమానం కాదన్నారు. 600 జడ్పీటీసీల్లో కనీసం ఆరు కూడా గెలవనోళ్లు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే తెలంగాణ బీజేపీ శాఖ పనిచేస్తోందని, టీఆర్‌ఎస్ బీజేపీ తోడుదొంగలని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలకు దోస్తీ లేకుంటే.. కేసీఆర్ ముందుస్తు ఎన్నిలకు వెళ్లినప్పుడు కాషాయ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయానికి తాళం వేసే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment