సాక్షి, నల్గొండ : నల్లగొండలో దారుణహత్యకు గురైన జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని శుక్రవారం ఆపార్టీ నేతలు పరామర్శించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యలు శ్రీనివాస్ భార్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీని ఓదార్చారు. హత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ శ్రీనివాస్ దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఆయన హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యకు సూత్రధారి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ప్రాణభయం ఉందని శ్రీనివాస్ దంపతులు గతంలోనే సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. హత్య జరిగి 48 గంటలు గడుస్తున్నా పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న అధికార పార్టీ నేతలను కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే: జానారెడ్డి
బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని జానా రెడ్డి తెలిపారు. పోలీసులు శ్రీనివాస్ ఫోన్ కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. ఈ హత్య కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే నిజానిజాలు బయటికొస్తాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment