srinivas murdered
-
సీబీఐ విచారణా..? రాజీనామానా..?
సాక్షి, హైదరాబాద్: బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసు, ఎమ్మెల్యే వేముల వీరేశం సన్నిహితుల కాల్‌డేటాపై సీబీఐతో విచారణ జరిపించాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ‘కాల్‌డేటా తప్పు, ఎవరైనా తయారుచేసుకోవచ్చు’అన్న జగదీశ్‌రెడ్డిని మంత్రి అనడానికి సిగ్గుపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. కాల్‌డేటా తప్పయితే పోలీసులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆ డేటా ప్రకారం తిరిగి విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మంగళవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చి బండి దగ్గర తగాదా అని పోలీసులు అంటుంటే, కాంగ్రెస్ అంతర్గత తగాదాలని మంత్రి అంటున్నారని విమర్శించారు. ఏది నిజమో తెలుసుకోకుండా మాట్లాడే వ్యక్తి మంత్రి స్థాయికి అనర్హుడని దుయ్యబట్టారు. మంత్రికి తెలివిలేదని వ్యాఖ్యానించారు. స్వగ్రామంలో, మరికొన్ని హత్య కేసుల్లో జగదీశ్‌రెడ్డి ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి 6 నెలలే మంత్రిగా ఉంటారని, ఆ తర్వాత చీప్ లిక్కర్ అమ్ముకుని బతకాలని ఎద్దేవా చేశారు. రాజకీయాల నుంచి కేసీఆర్ విరమించుకున్న తర్వాత హరీశ్‌రావు, కేటీఆర్ కొట్టుకుంటారన్నారు. -
శ్రీనివాస్ హత్య కేసులో మళ్లీ దర్యాప్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసుపై డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నుంచి కేసు పూర్తి వివరాలను తెలుసుకున్నారు. శ్రీనివాస్ హత్య నుంచి నిందితుల అరెస్టు వరకు జరిగిన పరిణామాలన్నింటినీ స్టీఫెన్ రవీంద్ర ఓ నివేదిక రూపంలో డీజీపీకి అందించారు. దీంతో.. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు ఏయే అంశాల్లో నిర్లక్ష్యం వహించారు, నిందితుల కాల్‌డేటాలో ఉన్న నంబర్లు ఎవరివి, వారికి నిందితులకు ఉన్న సంబంధమేమిటి, హత్య జరిగిన రోజు, తర్వాతి రోజు పదే పదే వెళ్లిన ఫోన్‌కాల్స్ వివరాలేమిటన్న అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని స్టీఫెన్ రవీంద్రను డీజీపీని ఆదేశించినట్టు తెలిసింది. మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు! శ్రీనివాస్ హత్య జరిగిన జనవరి 24 నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటిపైనా డీజీపీ సమీక్షించడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లయింది. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా గందరగోళంగా ఉండటం, కాల్‌డేటాను గాలికి వదిలేయడం, నిందితులను కస్టడీలోకి తీసుకోకపోవడం, కాంగ్రెస్ ఆరోపిస్తున్న అంశాలు.. వంటివన్నీ తేలనున్నాయి. ఇన్స్పెక్టర్ అదృశ్యం వెనక ఉన్న కారణాలు, ఒత్తిళ్లు వచ్చి ఉంటే అలా ఒత్తిడి చేసిందెవరన్న దానిపై నివేదిక ఇవ్వాలని కూడా డీజీపీ ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేసుకు సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టవద్దని, ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం సన్నగిల్లకుండా విచారణ జరగాలని ఆదేశించినట్టు సమాచారం. డీఎస్పీ, ఇన్స్పెక్టర్లతో ఐజీ భేటీ శ్రీనివాస్ హత్య కేసులో ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన నారాయణ్‌పేట్ డీఎస్పీ శ్రీధర్‌తో పాటు నల్లగొండ టూటౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం ఐజీ స్టీఫెన్ రవీంద్రను కలిశారు. కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. అయితే కాల్‌డేటాను విశ్లేషించడంలో నిర్లక్ష్యం, ఆ కాల్‌డేటాలోని గుర్తించి విచారించకపోవడంపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆరా తీసినట్టు తెలిసింది. అనుమానితులు పరారీ బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కాల్‌డేటాతో పేర్లు బయటికి వచ్చిన వారంతా పరారీలో ఉన్నట్టు నల్లగొండ పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు వెల్లడించారు. ఒకవేళ వారికి హత్యతో సంబంధం లేకుంటే ఎందుకు పరారయ్యారు, కారణాలేమిటన్న దానిపై దర్యాప్తు జరపాలని... రాంబాబు, మల్లేశ్‌ల కాల్‌డేటాలోని మిగతా అనుమానాస్పద నంబర్ల విషయం తేల్చాలని ఇన్స్పెక్టర్, డీఎస్పీలను ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించినట్టు తెలుస్తోంది. -
తెలంగాణ ఇందుకే ఇచ్చామా?
నల్లగొండ టూటౌన్: తమ కార్యకర్తలను చంపేందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో కుంతియా మాట్లాడారు. శ్రీనివాస్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ హత్యపై పార్లమెంట్లో చర్చ లేవనెత్తుతామని తెలిపారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలను తిప్పికొడతామన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. శ్రీనివాస్ హత్యలో భాగస్వామ్యం ఉన్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కనీసం సంతాపం కూడా తెలపలేదని విమర్శించారు. నార్కట్‌పల్లిలోని కాఫీ డే హోటల్‌కు శ్రీనివాస్‌ను పిలిపించి పార్టీ మారాలంటూ ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరించినది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్యకు సీఎం నుంచి జిల్లా ఎస్పీ వరకు బాధ్యత వహించాలన్నారు. కేసును తప్పుదోవ పట్టించిన ఎస్పీ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హత్య కేసులో నిందితులు జైలుకు వెళ్లిన ఐదు రోజుల్లో బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తమ కార్యకర్తలను హింసించే అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో, బయటా నిలదీస్తామని తెలిపారు. టీఆర్ఎస్ హత్యా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. కానిస్టేబుల్‌కు తక్కువ.. హోంగార్డుకు ఎక్కువ: రేవంత్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కానిస్టేబుల్‌కు తక్కువ.. హోంగార్డుకు ఎక్కువగా ఉన్నందునే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాల్ డేటా ఆధారంగా తొలుత ఎమ్మెల్యే వీరేశం, అతడి కుటుంబ సభ్యుల బట్టలూడదీస్తే.. వారి వెనకాల ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి బయటికి వస్తారని పేర్కొన్నారు. ఆయన వీపు పగులగొడితే సీఎం కేసీఆర్ బయటికి వస్తారన్నారు. కాంగ్రెస్ పాలనలో కన్నెర్ర చేసి ఉంటే కేసీఆర్ కుటుంబం ఊర్లు తిరిగేదా అని ప్రశ్నించారు. మొండేలతో మోరీలు నిండుతాయి: కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తలచుకుంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మొండేలతో మోరీలు నిండుతాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ పార్టీది గాంధీ సిద్ధాంతమన్నారు. పది మందికి సాయం చేసే గుణమే తప్ప తమకు హత్యా రాజకీయాలు తెలియవన్నారు. తనను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతకుముందు శ్రీనివాస్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనివాస్ హత్యపై ఎస్పీ అవాస్తవాలు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ కాంగ్రెస్ నేత, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయమై జిల్లా ఎస్పీ పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్చిబండి వివాదమే కారణమని చెబు తున్న పోలీసులు ఇప్పటిదాకా ఆ మిర్చిబండి యజమాని యాదయ్యను విచారించలేదన్నారు. తన భర్త కనిపిం చట్లేదని లక్ష్మి పోలీసులను కలిసినా స్పందించలేదని, మోహన్ అనే వ్యక్తి స్పందించి శ్రీనివాస్ శవాన్ని చూపిం చాడని వెల్లడించారు. పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా భర్త శవాన్ని లక్ష్మి ముందుగా చూసినట్టుగా అబద్ధం చెప్పా రన్నారు. ఈ హత్య గురించి పోలీసులకు ముందుగానే తెలుసునని, ఇది పథకం ప్రకారం జరిగిందని, దీనిలో సీఎం కేసీఆర్, డీజీపీ, ఎస్పీ పాత్ర ఉందని ఆరోపించారు. శ్రీనివాస్‌ను చంపేస్తామని 20 రోజుల ముందుగానే బెదిరింపులు వచ్చాయని చెప్పారు.మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను చంపేస్తామంటూ ఎమ్మెల్యే వీరేశం మనుషులు ఫోన్లలో బెదిరిస్తున్నారని, ఆయనను చంప డానికి కుట్ర జరుగుతున్నదన్నారు. బెదిరింపులు వస్తున్న ఫోన్ నంబర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదన్నారు. కేసును సీబీఐకి అప్పగించాల న్నారు. కేసుపై కోర్టులో అప్పీలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ పార్టీ చంపిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు. టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కోదండరాంను, తనను చంపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. -
శ్రీనివాస్ హత్యపై లబ్ధి పొందాలనే..
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య రాజకీయపరమైంది కాదని పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టినా కాంగ్రెస్ నేతలు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎన్.భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హత్య జరిగిన వెంటనే హతుని భార్య లక్ష్మి అనుచరులే నమ్మించి చంపారని ఆరోపించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హతుని భార్య దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాడాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చనిపోయిన శ్రీనివాస్ ఎప్పుడైనా టీఆర్ఎస్ మీద పిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. వీధి గొడవను, రాష్ట్ర గొడవగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో నల్లగొండ జిల్లాలో అనేకమంది చనిపోయారని, వారిని పరామర్శించి ఓదార్చడం తప్ప ఎలాంటి సాయం చేయలేదని, ఇది కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు హితవు పలికారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే వీరేశం దళితుడనే కాంగ్రెస్ నేత వీహెచ్ ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారని ఎమ్మెల్సీ పూలరవీందర్ ఆరోపించారు. -
కేసీఆర్ కుటుంబానికి హత్యాపాపం: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ కాంగ్రెస్‌నేత శ్రీనివాస్‌ను హత్య చేయించిన పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులకు తగులుతుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏటా అయ్యప్పమాల వేసుకునే శ్రీనివాస్ గురుస్వామిగా ఉన్నారని, అతడిని చంపిం చినందుకు తగినశాస్తి జరుగుతుందన్నారు. బీసీ నేతగా ఎదుగుతున్న అతన్ని చంపిం చిన టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెప్తారని పేర్కొ న్నారు. 10 రోజుల్లోగా దోషులను గుర్తించడానికి డీజీపీ చర్యలు తీసుకోవాలని, లేకుం టే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఎమ్మెల్యే వీరేశంను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
క్షణికావేశంలోనే హత్య
నల్లగొండ: క్షణికావేశంలోనే ఎమ్మెల్యే కోమటి రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. మిర్చిబండి వద్ద చోటుచేసుకున్న చిన్న గొడవే హత్యకు దారితీసిందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదనిస్పష్టం చేశా రు. ఆదివారం ఆయన వివరాలను మీడియా కు వివరించారు. మొత్తం 11 మంది నింది తులపై కేసు నమోదు చేశామని, వీరిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ నెల 24న రాత్రి ఆల్ఫా జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న యాదయ్య మిర్చి బండి వద్ద చింత కుంట్ల రాంబాబు, శరత్ మిర్చీలు తీసుకున్నారు. ఉల్లిగడ్డ ఎక్కువ ఇవ్వక పోవడంతో యాదయ్యతో గొడవపడ్డారు. అనంతరం మహేశ్ ఇంటికెళ్లగా కొద్దిసేపటికి మల్లేశ్ అక్కడికి వచ్చాడు. రాత్రి 10 గంటలకు మెరుగు గోపి, రాంబాబు ఫోన్ చేసి మిర్చి బండి వద్దకు రమ్మని చెప్పగా శరత్‌తో కలసి రాంబాబు అక్కడికి వెళ్లాడు. అక్కడ గోపి, రాంబాబుకు మధ్య గొడవ జరిగింది. గోపిపై రాంబాబు చేయి చేసుకున్నాడు. దీనిపై గోపి ఫోన్ చేసి శ్రీనివాస్‌కు వివరిం చాడు. శ్రీనివాస్ వచ్చి రాజీ కుదుర్చుకునే క్రమంలో మాటామాటా పెరిగి ఒకరికొకరు చేయిచేసుకున్నారు. ఈ ఘర్షణలో రాంబాబు, మల్లేశ్ బండరాయితో మోదడంతో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పో యాడని ఎస్పీ వివరించా రు. కేసులో రాంబాబు, మాండ్ర మల్లేశ్, అల్వాల శరత్‌రాజ్, దుర్గయ్య, కత్తుల కల్యాణ్ సామ్రాట్ అలియాస్ చక్రి, దామునూరి సతీష్, మాండ్ర మహేశ్, మిట్టపల్లి సాయి, మెరుగు గోపి, మాతంగి మోహన్, ప్రసాద్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రసాద్, మిట్టపల్లి సాయి, మాండ్ర మహేశ్ పరారీలో ఉన్నారని చెప్పారు. ‘తప్పుదోవ పట్టించేందుకు కుట్ర’ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/నల్లగొండ టౌన్: మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం వేర్వేరుగా శ్రీని వాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో ఎస్పీ మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం మిర్చిబండి దగ్గర జరిగిన చిన్న గొడవే శ్రీనివాస్ హత్యకు దారి తీసిందని పేర్కొనడం సమంజసం కాదన్నారు. -
టీఆర్ఎస్కు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని టీఆర్ఎస్కు ఆపాదించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలసి కర్నె శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, నల్లగొండలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం, చివరకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. హతుడు శ్రీనివాస్, నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచర బృందంలోని వారేనన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్ తదితరులు నల్లగొండకు వెళ్లి శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నె విమర్శించారు. శ్రీనివాస్ హత్యపై న్యాయ విచారణ జరగాలని టీఆర్ఎస్ఎల్పీ పక్షాన కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యే వీరేశం ఫోన్‌కాల్స్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌కాల్స్ జాబితాను కూడా బయట పెట్టాల్సిందిగా కోరాలన్నారు. ఫొటోలే విచారణకు ప్రామాణికమైతే నిందితులంతా కోమటిరెడ్డితో ఫొటోలు దిగారని, ప్రెస్మీట్లో ఆ ఫోటోలను విడుదల చేశారు. ఎమ్మెల్యే వీరేశంతో నిందితులు దిగిన ఫొటో ఆయన పీజీ పరీక్ష రాసేందుకు వచ్చినప్పుడు కాలేజీ వద్ద దిగినదని, యువ శాసన సభ్యుడు కాబట్టి వీరేశంతో వారు ఫొటోలు దిగారన్నారు. కాంగ్రెస్‌కు హత్యా రాజకీయాలు మొదట్నుంచీ అలవాటేనని, టీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు వ్యతిరేకమని కర్నె పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే వీరేశాన్ని విచారించాలి
సాక్షి, హైదరాబాద్: హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్రపై విచారణ జరపాలని డీజీపీని కోరారు. ఈ మేరకు ఉత్తమ్ నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ హత్యపై విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వేముల వీరేశం పాత్రపైనా విచారించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా నల్లగొండలోనే మకాం వేసి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను టీఆర్ఎస్లో చేరాలని వీరేశం బెదిరిస్తున్నారని, అందులో భాగంగానే శ్రీనివాస్ హత్య జరిగిందని తాము భావిస్తున్నామని ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే సీబీఐ విచారణ కోసం పోరాడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. సీఎం అండతో రెచ్చిపోతున్నారు: కోమటిరెడ్డి ఎమ్మెల్యే వీరేశం కనుసన్నల్లోనే తన అనుచరుడి హత్య జరిగిందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి అండతో వీరేశం రెచ్చిపోతున్నారని, తమను కూడా హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు చిరుమర్తి లింగయ్యకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై విచారణ జరపాలని డీజీపీ ని కోరామని తెలిపారు. బీసీలే టార్గెట్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని, నిందితులందరినీ ఎన్కౌంటర్ చెయ్యాలని మాజీ ఎంపీ వీ హన్మంతరావు డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను డీజీపీ అందించామని, దోషులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరామని చెప్పారు. డీజీపీని కలసిన వారిలో షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దాసోజు శ్రవణ్ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
‘నయీమ్‌లా వీరేశంను ఎన్కౌంటర్ చేయాలి’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు ప్రధాన సూత్రధారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలసి శుక్రవారం ఆయన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితులైన రాంబాబు, మల్లేశ్‌యాదవ్‌లు ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. ప్రభుత్వానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఎమ్మెల్యే వీరేశంపై చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్రిమినల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, అతని సోదరుడు ఏకే 47 గన్స్ రవాణా చేస్తూ రెండుసార్లు జైలుకు వెళ్లాడని ఉత్తమ్ వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎవరి అండ చూసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడని, మారుతాడనుకుంటే నేరాలు ఇంకా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ను టీఆర్ఎస్లో చేరాలని వీరేశం పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని, ఫలితం లేకపోవడంతో అంతమొందించారని ఆరోపించారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఆమె భర్త శ్రీనివాస్‌ను కోమటిరెడ్డి.. ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి వీరికి రక్షణ కల్పించాలని,, గన్‌మన్ ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ హత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని, సిగ్గుతో తలదించుకోవాలన్నారు. శ్రీనివాస్ హత్య విషయంలో పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే విచారణ పారదర్శకంగా జరిగేలా కనిపించడం లేదన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హత్యలే మార్గం అంటే మీ పార్టీలో ఎవ్వరూ ఉండరు: కోమటిరెడ్డి హత్యలే మార్గమంటే టీఆర్ఎస్లో ఎవరూ ఉండరని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ చూపిన శాంతియుత మార్గంలో పోరాటం చేస్తుందన్నారు. ఈ హత్య.. వీరేశం వెంట ఉన్న రౌడీలు చేశారని, దీనికి డీఎస్పీ సుధాకర్ పథకం వేశారని ఆరోపించారు. హత్య కేసులో ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అంతకుముందు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. టీఆర్ఎస్వి హత్యారాజకీయాలు: జానా సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని చూసి టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్ కాల్‌డేటా తీస్తే ఎమ్మెల్యే వీరేశం కాల్స్ ఉన్నాయో లేదో తేలుతుందని చెప్పారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నయీమ్ లాగానే వీరేశం హత్యలకు పాల్పడుతున్నాడని, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
'శ్రీనివాస్ హత్య.. సూత్రధారి ఎమ్మెల్యే వీరేశం'
సాక్షి, నల్గొండ : నల్లగొండలో దారుణహత్యకు గురైన జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని శుక్రవారం ఆపార్టీ నేతలు పరామర్శించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యలు శ్రీనివాస్ భార్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మీని ఓదార్చారు. హత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ శ్రీనివాస్ దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యకు సూత్రధారి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ప్రాణభయం ఉందని శ్రీనివాస్ దంపతులు గతంలోనే సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారని గుర్తు చేశారు. హత్య జరిగి 48 గంటలు గడుస్తున్నా పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న అధికార పార్టీ నేతలను కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే: జానారెడ్డి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని జానా రెడ్డి తెలిపారు. పోలీసులు శ్రీనివాస్ ఫోన్ కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. ఈ హత్య కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే నిజానిజాలు బయటికొస్తాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
కోమటిరెడ్డి అనుచరుడి దారుణహత్య
-
కోమటిరెడ్డి అనుచరుడి దారుణహత్య
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న దుండగులు డ్రైనేజీ పడేసి.. బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండలోని గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్‌కు ఫోన్ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్‌లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్‌ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బోరున విలపించిన కోమటిరెడ్డి హత్య సమాచారం తెలుసుకున్న వెంటనే గురువారం తెల్లవారుజామున కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మృతుడు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. భార్యా పిల్లలను చూసి బోరున విలపించారు. కొంతసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారు. 3 గంటల పాటు ధర్నా.. ఉద్రిక్తత శ్రీనివాస్ హత్యకు నిరసనగా కోమటిరెడ్డి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. క్లాక్‌టవర్ సెంటర్లో కోమటిరెడ్డి మూడు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. కాగా, పోస్టుమార్టమ్ పూర్తి కావడంతో శ్రీనివాస్ మృతదేహాన్ని మధ్యాహ్నం సావర్కర్‌నగర్‌లోని అతని ఇంటికి తరలించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ విషణ్ణ వదనంలో మునిగారు. జానా, గట్టు, మల్లు రవి ఖండన ఈ హత్యను సీఎల్పీ నేత జానారెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. నిందితులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ మరణం పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రాజకీయ జీవితం ప్రారంభం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉన్నాడని గట్టు అన్నారు. శ్రీనివాస్ మృత దేహంపై పూలమాల వేసి గట్టు నివాళి అర్పించారు. శ్రీనివాస్ మృతదేహంపై తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. హత్య వెనుక అధికారపార్టీ నేతలు: కోమటిరెడ్డి ►గతంలో నయీం ముఠా సభ్యులు చంపుతామన్నారు ►టీఆర్ఎస్లో చేరాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరించారు ►హత్య కేసును సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్ శ్రీనివాస్ హత్యపై కోమటిరెడ్డి సోదరులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం, పోలీసు అధికారుల వైఫల్యం ఉందని ఆరోపించారు. శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ క్లాక్‌టవర్ దగ్గర నిర్వహించిన ధర్నాలో.. అనంతరం మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గురువారం మాట్లాడారు. శ్రీనివాస్ హత్య జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్‌పల్లిలోని వివేరా హోటల్‌కు పిలిపించి, టీఆర్ఎస్లో చేరాలని శ్రీనివాస్‌ను బెదిరించాడన్నారు. శ్రీనివాస్ కాల్‌డేటా ఆరాతీస్తే హత్యకు వెనుక ఎవరి కుట్ర దాగి ఉందనేది బయటపడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే వీరేశం సోదరుడు తుపాకుల వ్యాపారం చేస్తూ సిద్దిపేట పోలీసులకు పట్టుబడితే.. వీరేశం కిరాయి హత్యలు చేయిస్తున్నాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నయీం ముఠా సభ్యులు శ్రీనివాస్‌ను ఏకే 47 గన్‌తో చంపుతామని బెదిరించారని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడి బొడ్డుపల్లి దంపతులు గన్‌మన్ కల్పించాలని గతంలో ముఖ్యమంత్రిని కూడా కోరినట్లు పేర్కొన్నారు. హత్యకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీసీఐడీతో సమగ్ర విచారణ చేయించాలని, డీఎస్పీ సుధాకర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మారనన్నందుకే శ్రీనివాస్‌ను హత్య చేశారన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. తన భర్తను టీఆర్ఎస్ నాయకులు పథకం ప్రకారమే చంపారని మున్సిపల్ చైర్పర్సన్, మృతుడి భార్య బొడ్డుపల్లి లక్ష్మి ఆరోపించారు. గోపి, మోహన్‌లు అమ్ముడుపోయి తమను నమ్మించి మోసం చేసి తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. తమకు భద్రత కావాలని 15 రోజుల క్రితం కూడా కలెక్టర్, గతంలో ఎస్పీని కలసి విజ్ఞప్తి చేశామని, గన్మన్లను కేటాయించకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారన్నారు. -
భార్యను వేధిస్తున్నాడని హతమర్చాడు..
కాశీపేట(ఆదిలాబాద్): ఓ వివాహితను వేధిస్తున్న దుండగుడు, ఆమె భర్త చేతిలోనే చివరికి హతమయ్యాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కాశీపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. కాశీపేట మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన రఘు అనే వ్యక్తి భార్యను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త, ఆవేశంతో శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.