డీజీపీకి వినతిపత్రం సమర్పించి వస్తున్న ఉత్తమ్. చిత్రంలో రాజగోపాల్ రెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, షబ్బీర్, కోమటిరెడ్డి, దాసోజు
సాక్షి, హైదరాబాద్: హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నకిరేకల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్రపై విచారణ జరపాలని డీజీపీని కోరారు. ఈ మేరకు ఉత్తమ్ నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.
ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ హత్యపై విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వేముల వీరేశం పాత్రపైనా విచారించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా నల్లగొండలోనే మకాం వేసి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌లో చేరాలని వీరేశం బెదిరిస్తున్నారని, అందులో భాగంగానే శ్రీనివాస్ హత్య జరిగిందని తాము భావిస్తున్నామని ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే సీబీఐ విచారణ కోసం పోరాడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
సీఎం అండతో రెచ్చిపోతున్నారు: కోమటిరెడ్డి
ఎమ్మెల్యే వీరేశం కనుసన్నల్లోనే తన అనుచరుడి హత్య జరిగిందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి అండతో వీరేశం రెచ్చిపోతున్నారని, తమను కూడా హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు చిరుమర్తి లింగయ్యకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై విచారణ జరపాలని డీజీపీ ని కోరామని తెలిపారు.
బీసీలే టార్గెట్‌గా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని, నిందితులందరినీ ఎన్‌కౌంటర్ చెయ్యాలని మాజీ ఎంపీ వీ హన్మంతరావు డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను డీజీపీ అందించామని, దోషులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరామని చెప్పారు. డీజీపీని కలసిన వారిలో షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దాసోజు శ్రవణ్ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment