Veeresham
-
‘మాజీ ఎమ్మెల్యే వీరేశంను విచారిస్తాం’
సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసు లో మొత్తం 7 గురు నిందితులు ఉన్నారని ఎస్పీ రంగనాథ్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ హత్యకు సంబంధించి మొత్తం కోటి రూపాయల డీల్ జరిగినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 18 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు తెలిపాడు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసున్నారని వివరించారు. దీనిలో భాగమైన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరితో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తామని అన్నారు. నల్గొండ కి చెందిన మాజీ ఐసిస్ టెర్రరిస్ట్ లు ప్రణయ్ హత్య కేసు లో ఇన్వాల్వ్ అయ్యారని, ప్రణయ్‌ను చంపిన వాడు బీహార్‌కు చెందినవాడని తెలిపారు. -
శ్రీనివాస్ హత్యతో సంబంధం లేదు: ఎమ్మెల్యే వీరేశం
సాక్షి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్స్ శవ రాజకీయాలు చేస్తున్నారని, సీబీఐ విచారణ జరిపించినా అభ్యంతరం లేదని అన్నారు. నమ్మిన వారే హత్య చేశారని మృతుడి భార్యే చెప్పిందన్నారు. అదనపు గన్మెన్లు కావాలని డీజీపీని కోరిన కోమటిరెడ్డి శ్రీనివాస్ కుటుంబానికి రక్షణ కావాలని ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ మూడున్నరేళ్ల తన ఫోన్ కాల్ డేటా బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని, నయీమ్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీనే అని వేముల ఆరోపించారు. -
ఎమ్మెల్యే వీరేశాన్ని విచారించాలి
సాక్షి, హైదరాబాద్: హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్రపై విచారణ జరపాలని డీజీపీని కోరారు. ఈ మేరకు ఉత్తమ్ నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ హత్యపై విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వేముల వీరేశం పాత్రపైనా విచారించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా నల్లగొండలోనే మకాం వేసి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను టీఆర్ఎస్లో చేరాలని వీరేశం బెదిరిస్తున్నారని, అందులో భాగంగానే శ్రీనివాస్ హత్య జరిగిందని తాము భావిస్తున్నామని ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే సీబీఐ విచారణ కోసం పోరాడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. సీఎం అండతో రెచ్చిపోతున్నారు: కోమటిరెడ్డి ఎమ్మెల్యే వీరేశం కనుసన్నల్లోనే తన అనుచరుడి హత్య జరిగిందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి అండతో వీరేశం రెచ్చిపోతున్నారని, తమను కూడా హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోపాటు చిరుమర్తి లింగయ్యకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై విచారణ జరపాలని డీజీపీ ని కోరామని తెలిపారు. బీసీలే టార్గెట్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని, నిందితులందరినీ ఎన్కౌంటర్ చెయ్యాలని మాజీ ఎంపీ వీ హన్మంతరావు డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను డీజీపీ అందించామని, దోషులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరామని చెప్పారు. డీజీపీని కలసిన వారిలో షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దాసోజు శ్రవణ్ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
‘నయీమ్‌లా వీరేశంను ఎన్కౌంటర్ చేయాలి’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు ప్రధాన సూత్రధారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలసి శుక్రవారం ఆయన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితులైన రాంబాబు, మల్లేశ్‌యాదవ్‌లు ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. ప్రభుత్వానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఎమ్మెల్యే వీరేశంపై చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్రిమినల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, అతని సోదరుడు ఏకే 47 గన్స్ రవాణా చేస్తూ రెండుసార్లు జైలుకు వెళ్లాడని ఉత్తమ్ వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎవరి అండ చూసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడని, మారుతాడనుకుంటే నేరాలు ఇంకా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ను టీఆర్ఎస్లో చేరాలని వీరేశం పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని, ఫలితం లేకపోవడంతో అంతమొందించారని ఆరోపించారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఆమె భర్త శ్రీనివాస్‌ను కోమటిరెడ్డి.. ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి వీరికి రక్షణ కల్పించాలని,, గన్‌మన్ ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ హత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని, సిగ్గుతో తలదించుకోవాలన్నారు. శ్రీనివాస్ హత్య విషయంలో పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే విచారణ పారదర్శకంగా జరిగేలా కనిపించడం లేదన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హత్యలే మార్గం అంటే మీ పార్టీలో ఎవ్వరూ ఉండరు: కోమటిరెడ్డి హత్యలే మార్గమంటే టీఆర్ఎస్లో ఎవరూ ఉండరని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ చూపిన శాంతియుత మార్గంలో పోరాటం చేస్తుందన్నారు. ఈ హత్య.. వీరేశం వెంట ఉన్న రౌడీలు చేశారని, దీనికి డీఎస్పీ సుధాకర్ పథకం వేశారని ఆరోపించారు. హత్య కేసులో ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అంతకుముందు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. టీఆర్ఎస్వి హత్యారాజకీయాలు: జానా సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని చూసి టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్ కాల్‌డేటా తీస్తే ఎమ్మెల్యే వీరేశం కాల్స్ ఉన్నాయో లేదో తేలుతుందని చెప్పారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నయీమ్ లాగానే వీరేశం హత్యలకు పాల్పడుతున్నాడని, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే భార్యపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: ఎమ్మెల్యే భార్య తనను చంపుతానంటూ బెదిరిస్తోందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిపై గృహ హింస కేసు ఉంది. అయితే ఈ కేసులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య పుష్పలత జోక్యం చేసుకోవటంతోపాటు తనను వేధిస్తోందని రాజశేఖర్ శుక్రవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు. -
డిగ్రీ పరీక్ష రాసిన ఎమ్మెల్యే వీరేశం
నల్లగొండ అర్బన్: నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ఓపెన్ డిగ్రీ ఫైనలియర్ పరీక్షకు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన ఆయన.. వివిధ కారణాలతో ఫైనలియర్ పరీక్ష రాయలేదు. తాను ఉద్యమాల్లో తలమునకలవడంతో ఉన్నతవిద్య కొనసాగించలేకపోయానన్నారు. అది వెలితిగా ఉండేదని ఎమ్మెల్యే వీరేశం ‘సాక్షి’కి తెలిపారు.