నిందితులు రాంబాబు, మల్లేశ్‌యాదవ్‌లు ఎమ్మెల్యే వీరేశంతో దిగిన ఫొటోను చూపిస్తున్న ఉత్తమ్, చిత్రంలో షబ్బీర్, జానారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి తదితరులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు ప్రధాన సూత్రధారి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలసి శుక్రవారం ఆయన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు.
శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితులైన రాంబాబు, మల్లేశ్‌యాదవ్‌లు ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. ప్రభుత్వానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలన్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం ఎమ్మెల్యే వీరేశంపై చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్రిమినల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, అతని సోదరుడు ఏకే 47 గన్స్ రవాణా చేస్తూ రెండుసార్లు జైలుకు వెళ్లాడని ఉత్తమ్ వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎవరి అండ చూసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు.
క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడని, మారుతాడనుకుంటే నేరాలు ఇంకా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ను టీఆర్‌ఎస్‌లో చేరాలని వీరేశం పలుమార్లు ఒత్తిడి తెచ్చాడని, ఫలితం లేకపోవడంతో అంతమొందించారని ఆరోపించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, ఆమె భర్త శ్రీనివాస్‌ను కోమటిరెడ్డి.. ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి వీరికి రక్షణ కల్పించాలని,, గన్‌మన్ ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ హత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని, సిగ్గుతో తలదించుకోవాలన్నారు. శ్రీనివాస్ హత్య విషయంలో పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే విచారణ పారదర్శకంగా జరిగేలా కనిపించడం లేదన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
హత్యలే మార్గం అంటే మీ పార్టీలో ఎవ్వరూ ఉండరు: కోమటిరెడ్డి
హత్యలే మార్గమంటే టీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ చూపిన శాంతియుత మార్గంలో పోరాటం చేస్తుందన్నారు. ఈ హత్య.. వీరేశం వెంట ఉన్న రౌడీలు చేశారని, దీనికి డీఎస్పీ సుధాకర్ పథకం వేశారని ఆరోపించారు. హత్య కేసులో ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అంతకుముందు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.
టీఆర్‌ఎస్‌వి హత్యారాజకీయాలు: జానా
సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని చూసి టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్ కాల్‌డేటా తీస్తే ఎమ్మెల్యే వీరేశం కాల్స్ ఉన్నాయో లేదో తేలుతుందని చెప్పారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నయీమ్ లాగానే వీరేశం హత్యలకు పాల్పడుతున్నాడని, అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment