ఆదివారం నల్లగొండలో సంతాప సభకు హాజరైన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, ఉత్తమ్, కుంతియా, జానారెడ్డి, షబ్బీర్, మధుయాష్కీ, రేవంత్
నల్లగొండ టూటౌన్: తమ కార్యకర్తలను చంపేందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండలో జరిగిన మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో కుంతియా మాట్లాడారు. శ్రీనివాస్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ హత్యపై పార్లమెంట్‌లో చర్చ లేవనెత్తుతామని తెలిపారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆగడాలను తిప్పికొడతామన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. శ్రీనివాస్ హత్యలో భాగస్వామ్యం ఉన్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కనీసం సంతాపం కూడా తెలపలేదని విమర్శించారు. నార్కట్‌పల్లిలోని కాఫీ డే హోటల్‌కు శ్రీనివాస్‌ను పిలిపించి పార్టీ మారాలంటూ ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరించినది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శ్రీనివాస్ హత్యకు సీఎం నుంచి జిల్లా ఎస్పీ వరకు బాధ్యత వహించాలన్నారు.
కేసును తప్పుదోవ పట్టించిన ఎస్పీ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హత్య కేసులో నిందితులు జైలుకు వెళ్లిన ఐదు రోజుల్లో బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తమ కార్యకర్తలను హింసించే అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో, బయటా నిలదీస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ హత్యా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు.
కానిస్టేబుల్‌కు తక్కువ.. హోంగార్డుకు ఎక్కువ: రేవంత్
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కానిస్టేబుల్‌కు తక్కువ.. హోంగార్డుకు ఎక్కువగా ఉన్నందునే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాల్ డేటా ఆధారంగా తొలుత ఎమ్మెల్యే వీరేశం, అతడి కుటుంబ సభ్యుల బట్టలూడదీస్తే.. వారి వెనకాల ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి బయటికి వస్తారని పేర్కొన్నారు. ఆయన వీపు పగులగొడితే సీఎం కేసీఆర్ బయటికి వస్తారన్నారు. కాంగ్రెస్ పాలనలో కన్నెర్ర చేసి ఉంటే కేసీఆర్ కుటుంబం ఊర్లు తిరిగేదా అని ప్రశ్నించారు.
మొండేలతో మోరీలు నిండుతాయి: కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ తలచుకుంటే టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల మొండేలతో మోరీలు నిండుతాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ పార్టీది గాంధీ సిద్ధాంతమన్నారు. పది మందికి సాయం చేసే గుణమే తప్ప తమకు హత్యా రాజకీయాలు తెలియవన్నారు. తనను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
అంతకుముందు శ్రీనివాస్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment