‘సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటం’ | We Will Struggle Against TS Govt Policies Says Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

బలోపేతంపై కసరత్తు సాగర్‌లో టీపీసీసీ

Published Sun, Jun 30 2019 8:03 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

We Will Struggle Against TS Govt Policies Says Uttam Kumar Reddy - Sakshi

టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో షబ్బీర్, జానారెడ్డి, కుంతియా, జీవన్‌రెడ్డి, పొన్నం తదితరులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకత్వం కూలంకశంగా చర్చించింది. పార్టీ భవిష్యత్, ప్రభుత్వంపై సాగించాల్సిన పోరాటాలు, దానికి అవలంభించాల్సిన విధానాలు, రానున్న మున్సిపల్‌ ఎన్నికలు.. సాగునీటి ప్రాజెక్టులు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై కాంగ్రెస్‌ పెద్దలు మేధోమథనం చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో శనివారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది.

టీపీపీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతి యా, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లు పాల్గొనగా సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ఇన్‌కేమెరాగా జరిగిన ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు, దాంతో జరిగే నష్టాలపై నైనాల గోవర్ధన్‌ వివరించగా, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ఎలాంటి విధానం అవలంభించాలనే దానిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వివరించారు. 

జూలై మొదటి వారంలో డీసీసీ సమావేశాలు.. 
జూలై మొదటి వారంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సమా వేశాలు జరపాలని నిర్ణయించారు. ముందుగా కొత్త జిల్లాల్లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. అనంతరం మున్సిపాలిటీల స్థాయిలో కూడా సమావేశాలు జరపనున్నారు. జూలై 1 నుంచి 4లోగా డీసీసీ విçస్తృతస్థాయి సమావేశాలు.. 5 నుంచి 10లోగా అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు పెట్టాలని నిర్ణయం జరిగింది. ఎలాంటి ఇబ్బందులూ లేని నియోజక వర్గాల్లో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యత అప్పజెప్పాలని నిర్ణయించారు. డీసీసీ భవనాలకు ప్రభుత్వం భూములు కేటాయిం చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సమావేశంలో చర్చకు వచ్చింది.

సచివాలయం కూల్చివేత విషయాన్ని కాంగ్రెస్‌ పూర్తిగా వ్యతిరేకించాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, టీఆర్‌ఎస్‌ను నిలదీయాలని తీర్మానించారు. మునిసిపాలిటీల్లో ఎన్నికల కోసం అభ్యర్థులను ‘సెలక్ట్‌ అండ్‌ ఎలెక్ట్‌’పద్ధతిలో టికెట్లు కేటాయించాలన్న ప్రతిపాదనలకే నాయకత్వం మొగ్గుచూపిందని సమాచారం. టీపీసీసీ ముఖ్య నాయకులు కొన్ని మున్సిపాలిటీల బాధ్యతలు తీసుకోవాలని తేల్చారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ పరిధిలోని 40 మున్సిపాలిటీలపై ఎంపీలు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పార్టీ నేత కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  

సచివాలయం సందర్శన... 
కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సోమవారం సచివాల యాన్ని సందర్శించి భవనాలను పరిశీలించాలని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. ఏ భవనం ఎప్పుడు నిర్మించారు? ఎప్పుడు శంకు స్థాప న జరిగింది? ఎప్పుడు ప్రారంభించారో తెలుసుకునేందుకు శిలాఫలకాలను పరిశీలించాలని నిర్ణయించారు. పాత భవనాలను కూల్చివేయకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని, ఈ విషయా న్ని ప్రభుత్వానికి సూచించాలని రేవంత్‌ చెప్పారు. అద్దె గదుల్లో నడుస్తున్న ప్రభుత్వ శాఖలకు సచివాల య భవనాలను వాడుకోవచ్చని సూచించారు.  
 

ప్రతి నెలా ఇలాంటి సమావేశాలు: కుంతియా 
ప్రతినెలా ఇదే తరహాలో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కుంతియా సూచించారు. సమన్వయ కమిటీ, వర్కింగ్‌ కమిటీ, టీపీసీసీ కమిటీ కలసి çసమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతినెలా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండలస్థాయి సమావేశాలు తప్పనిసరిగా జరుపుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 నియోజకవర్గాల్లో బాధ్యులు లేరని, అక్కడ ఒక కమిటీ వేసి కో–ఆర్డినేటర్లను నియమించి పని చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి నాయకులను ఒక్కో నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌గా పని చేయించాలని, సీనియర్‌ లీడర్లు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులతో రాష్ట్రస్థాయిలో సమన్వయ కమిటీని వేయాలని తీర్మానించారు. రాహుల్‌ రాజీనామాను ఉప సంహరించుకుని మళ్లీ పార్టీలో యాక్టివ్‌గా పనిచేయాలని కోరాలని ఈ సమావేశం నిర్ణయించింది. 

బాధ్యతతో పనిచేయాలి: కోమటిరెడ్డి  
ముఖ్యనేతలంతా మున్సిపల్‌ ఎన్నికల్లో బాధ్యతతో పనిచేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం 20 శాతం పూర్తికాకున్నా హడావుడిగా ప్రారంభించారని పేర్కొ న్నారు. కాళేశ్వరంపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంపై పిల్‌ వేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కొత్త జిల్లాల వారీగా దత్తత తీసుకొని పార్టీని బలోపేతం చేద్దామని సూచించారు. గ్రామగ్రామాన తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు.

ప్రభుత్వ విధానాలపై పోరాటాలు: ఉత్తమ్‌ 
కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై పోరాటం చేస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. కొత్త అసెంబ్లీ భవనాల అవసరమే లేదని, ఇక పాత సచివాలయం కూల్చొ ద్దని కోరారు. సోమవారం జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి సచివాలయాన్ని పరిశీలిస్తారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్న తప్పుడు భావన రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై స్పష్టమైన వైఖరి కోసం కమిటీ వేస్తామన్నారు. అలాగే ప్రాజెక్టులకు బ్యాంకులు ఎలా రుణాలు ఇస్తున్నాయో చూడాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాహుల్‌ గాంధీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానం చేసి పంపిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement