సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో కుంతియా, జైపాల్‌రెడ్డి, భట్టి, పొన్నాల తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న శంషాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాహుల్ సభ ఏర్పాట్లపై చర్చించేందుకుగాను బుధవారం ఇక్కడి గాంధీభవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, రోహిత్‌రెడ్డి, సీతక్క, హరిప్రియ నాయక్‌లతోపాటు పలువురు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఉత్తమ్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల ప్రచారశంఖారావం పూరించేందుకు రాష్ట్రానికి వస్తున్న రాహుల్ సభ విజయవంతమయ్యేలా నాయకులంతా కృషి చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకుని లోక్‌సభ ఎన్నికలపై నేతల దృష్టి మళ్లించేందుకుగాను ఈ సభను ఉపయోగించుకోవాలని, రాహుల్‌సభ స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలిచ్చే విధంగా పెద్దఎత్తున జనసమీకరణ జరపాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ కూడా రేపో, మాపో అంటున్న తరుణంలో జరుగుతున్న రాహుల్ బహిరంగసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీపై భరోసా కలిగించేలా నేతలు పనిచేయాలని కోరారు.
ఇంకా నాన్ సీరియస్సేనా?
ఓ వైపు లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇంకా స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోతున్న తరుణంలో జరుగుతున్న రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశానికి పలువురు ముఖ్యులు డుమ్మా కొట్టడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులుగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ముఖ్యంగా సభ నిర్వహిస్తున్న సమీప ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment