
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న దుండగులు డ్రైనేజీ పడేసి.. బండరాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండలోని గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్ చైర్‌పర్సన్ భర్త శ్రీనివాస్‌కు ఫోన్ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్‌లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్‌ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
బోరున విలపించిన కోమటిరెడ్డి
హత్య సమాచారం తెలుసుకున్న వెంటనే గురువారం తెల్లవారుజామున కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మృతుడు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. భార్యా పిల్లలను చూసి బోరున విలపించారు. కొంతసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చారు.
3 గంటల పాటు ధర్నా.. ఉద్రిక్తత
శ్రీనివాస్ హత్యకు నిరసనగా కోమటిరెడ్డి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. క్లాక్‌టవర్ సెంటర్‌లో కోమటిరెడ్డి మూడు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. నిందితులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. కాగా, పోస్టుమార్టమ్ పూర్తి కావడంతో శ్రీనివాస్ మృతదేహాన్ని మధ్యాహ్నం సావర్కర్‌నగర్‌లోని అతని ఇంటికి తరలించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ విషణ్ణ వదనంలో మునిగారు.
జానా, గట్టు, మల్లు రవి ఖండన
ఈ హత్యను సీఎల్పీ నేత జానారెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. నిందితులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ మరణం పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రాజకీయ జీవితం ప్రారంభం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉన్నాడని గట్టు అన్నారు. శ్రీనివాస్ మృత దేహంపై పూలమాల వేసి గట్టు నివాళి అర్పించారు. శ్రీనివాస్ మృతదేహంపై తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.
హత్య వెనుక అధికారపార్టీ నేతలు: కోమటిరెడ్డి
►గతంలో నయీం ముఠా సభ్యులు చంపుతామన్నారు
►టీఆర్‌ఎస్‌లో చేరాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరించారు
►హత్య కేసును సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్
శ్రీనివాస్ హత్యపై కోమటిరెడ్డి సోదరులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం, పోలీసు అధికారుల వైఫల్యం ఉందని ఆరోపించారు. శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ క్లాక్‌టవర్ దగ్గర నిర్వహించిన ధర్నాలో.. అనంతరం మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గురువారం మాట్లాడారు. శ్రీనివాస్ హత్య జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్‌పల్లిలోని వివేరా హోటల్‌కు పిలిపించి, టీఆర్‌ఎస్‌లో చేరాలని శ్రీనివాస్‌ను బెదిరించాడన్నారు. శ్రీనివాస్ కాల్‌డేటా ఆరాతీస్తే హత్యకు వెనుక ఎవరి కుట్ర దాగి ఉందనేది బయటపడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే వీరేశం సోదరుడు తుపాకుల వ్యాపారం చేస్తూ సిద్దిపేట పోలీసులకు పట్టుబడితే.. వీరేశం కిరాయి హత్యలు చేయిస్తున్నాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నయీం ముఠా సభ్యులు శ్రీనివాస్‌ను ఏకే 47 గన్‌తో చంపుతామని బెదిరించారని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడి బొడ్డుపల్లి దంపతులు గన్‌మన్ కల్పించాలని గతంలో ముఖ్యమంత్రిని కూడా కోరినట్లు పేర్కొన్నారు. హత్యకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీసీఐడీతో సమగ్ర విచారణ చేయించాలని, డీఎస్పీ సుధాకర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మారనన్నందుకే శ్రీనివాస్‌ను హత్య చేశారన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. తన భర్తను టీఆర్‌ఎస్ నాయకులు పథకం ప్రకారమే చంపారని మున్సిపల్ చైర్‌పర్సన్, మృతుడి భార్య బొడ్డుపల్లి లక్ష్మి ఆరోపించారు. గోపి, మోహన్‌లు అమ్ముడుపోయి తమను నమ్మించి మోసం చేసి తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. తమకు భద్రత కావాలని 15 రోజుల క్రితం కూడా కలెక్టర్, గతంలో ఎస్పీని కలసి విజ్ఞప్తి చేశామని, గన్‌మన్‌లను కేటాయించకుండా టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment