
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య రాజకీయపరమైంది కాదని పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టినా కాంగ్రెస్ నేతలు ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎన్.భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలసి టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
హత్య జరిగిన వెంటనే హతుని భార్య లక్ష్మి అనుచరులే నమ్మించి చంపారని ఆరోపించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హతుని భార్య దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాడాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చనిపోయిన శ్రీనివాస్ ఎప్పుడైనా టీఆర్‌ఎస్ మీద పిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. వీధి గొడవను, రాష్ట్ర గొడవగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గతంలో నల్లగొండ జిల్లాలో అనేకమంది చనిపోయారని, వారిని పరామర్శించి ఓదార్చడం తప్ప ఎలాంటి సాయం చేయలేదని, ఇది కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు హితవు పలికారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే వీరేశం దళితుడనే కాంగ్రెస్ నేత వీహెచ్ ఎన్‌కౌంటర్ చేయాలని అంటున్నారని ఎమ్మెల్సీ పూలరవీందర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment