
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తప్పించుకునే ప్రయత్నం చేశాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వాలు అలానే చేశాయన్నారు. ఎన్నికలను తప్పించుకోవడానికి కోర్టులో కేసులు వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడ్డాయని మండిపడ్డారు. ఇక తాజగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్‌లోని అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోబోతుందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను ఎంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని, కాగా సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి.. కళ్లులొట్ట పోయినట్లుగా బయటపడ్డారని ఎద్దేవా చేశారు.
ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డబ్బుతో, భట్టి విక్రమార్క దయతో అసెంబ్లీలో గెలిచారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దూరం అయిందని, ఎన్నికలను అపహాస్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాధిస్తున్న విజయాల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఎన్నికల్లో బీజేపీ మతం తప్ప వేరే ప్రచారం చేయలేదని, ప్రజలకు సంబంధించి ఒక్క విషయం మాట్లాడలేదని పేర్కొన్నారు. అశాంతి కావాలంటే బీజేపీ.. అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లామన్నారు. క్యాంప్ రాజకీయాలకు చిరునామాగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ చేసిన రాజకీయాలు దేశం అంతా చుశారని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment