ఆమె డ్యాన్స్‌ చేస్తేనే మీకు ఓట్లు! | Congress Minister Says Hema Malini Dance Performances To Earn Votes | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 28 2019 9:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Minister Says Hema Malini Dance Performances To Earn Votes - Sakshi

భోపాల్‌ : ఎన్నికల ముందే బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు వ‍్యక్తిగతంగా దూషించుకుంటూ రచ్చకెక్కుతున్నారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్‌.. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకంపై బీజేపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం.. దీనికి కాంగ్రెస్‌ సైతం అదే రీతిలో తిప్పికొడుతుండటం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. జనాకర్షక నేతలు లేకనే కాంగ్రెస్‌ చాక్లెట్‌ ఫేస్‌వంటి ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకొచ్చిందని బీజేపీ నేత ఖైలాష్‌ విజయ్‌వర్గీయాస్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ కాంగ్రెస్‌కు జనాకర్షక నేతలే లేరు. అందుకే అందమైన ముఖాలను తీసుకొచ్చి ఎన్నికల్లో ఓట్లు పొందాలని భావించింది. దీని కోసం కొందరు కరీనా కపూర్‌ను, మరికొందరు సల్మాన్‌ ఖాన్‌ను సూచించారు. కానీ కాంగ్రెస్‌ చివరకు ప్రియాంక గాంధీని తీసుకొచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ప్రియాంక అందాన్ని చాక్లెట్‌తో పోల్చడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ తీవ్రంగా స్పందించారు. 

‘బీజేపీలో కూడా జనాకర్షక నేతలు ఎవరూ లేరు. ఆ పార్టీలోని నేతల ముఖాలను కనీసం జనాలు కూడా గుర్తించలేరు. వారి పార్టీలో ఒకరే ఒకరున్నారు. ఆమె నటి హేమమాలిని. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు పొందాలంటే హెమమాలినితో క్లాసికల్‌ డ్యాన్స్‌ చేయించాల్సిందే. ఆమె క్లాసికల్‌ డ్యాన్స్‌ అదరగొడితేనే బీజేపీకి ఓట్లు పడతాయి. మనల్ని దేవుడు సృష్టిస్తాడు. మన రూపాన్నిచ్చేది కూడా ఆయనే. ప్రజలు ప్రతి ఒక్కరిని ఆదరించాల్సిందే. దేవుడు ప్రియాంకను అందంగా పుట్టించడం ఆమె తప్పుకాదు. అందంగా ఉన్నవారిని బీజేపీ ప్రశంసించాలి. కానీ ఇలా వ్యాఖ్యానించకూడదు. ప్రియాంక పట్ల ఈ తరహా వ్యాఖ్యలతో విజయ్‌ వర్గీయాస్‌ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు. సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు’ అని ఘాటుగా బదులిచ్చాడు.

ప్రియాంక అందంపై నోరు జారిన బీజేపీ నేత ఖైలాష్‌ విజయ్‌వర్గీయాస్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రియాంకను ఉద్దేశించి చాక్లెట్‌ అనే పదం వాడలేదని, బాలీవుడ్‌ నటులను ప్రస్తావిస్తూ అన్నానని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికి ఇరుపార్టీల ఈ తరహా మాటలు పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement